KRMB Meeting at Hyderabad Today: ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. తద్వారా రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత వాడుకొన్నది.. ఎవరి వాటా ఎంత మిగిలి ఉందో తేలిపోతుందని పేర్కొంది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వాదనలు వినిపించారు. అయితే ఇవాళ్టి సమావేశానికి తాను హాజరు కావడం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ముందుగానే సమాచారం ఇచ్చారు.
నీటి లెక్కల విషయంలో కఠినంగా ఉండాలి:పోలవరం పర్యటన ఉన్నందున హాజరు కావడం వీలు కాదని... బోర్డు సభ్య కార్యదర్శికి తెలిపారు. దీంతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే వాటాకు మించి కృష్ణా నీటిని వాడుకుందన్న తెలంగాణ... నీటి లెక్కల విషయంలో కఠినంగా ఉండాలని కోరింది. తమకు ఇంకా 141టీఎంసీలకు అవకాశం ఉందని, ఆ మేరకు నీటిని వాడుకుంటామని ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలో త్రిసభ్య కమిటీ మరోమారు సమావేశమయ్యే అవకాశం ఉంది. అటు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. కొత్త ఛైర్మన్ వచ్చినందున బోర్డు సమావేశం పెట్టాలన్న ఈఎన్సీ మురళీధర్... పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో అన్ని అంశాలపై చర్చిద్దామని ప్రతిపాదించారు.