తెలంగాణ

telangana

ETV Bharat / state

KRMB: కాసేపట్లో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం - telangana varthalu

తెలుగు రాష్ట్రాలకు కృష్ణాజలాల్లో వాటా ఖరారు ప్రధాన ఎజెండాగా నదీ యాజమాన్య బోర్డు భేటీ జరగనుంది. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో వాటా పెరగాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోరుతుండడం, పరసర్ప ఫిర్యాదుల నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు సంయుక్త భేటీ కూడా ఇవాళే జరగనుంది.

KRMB: ఇవాళ్టి కృష్ణా బోర్డు భేటీతో నీటి వాటా లెక్క తేలేనా?
KRMB: ఇవాళ్టి కృష్ణా బోర్డు భేటీతో నీటి వాటా లెక్క తేలేనా?

By

Published : Sep 1, 2021, 1:44 AM IST

Updated : Sep 1, 2021, 10:46 AM IST

కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం ఇవాళ జరనుంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీసింగ్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో ఉదయం జరగనున్న భేటీలో బోర్డు ప్రతినిధులు, రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొంటారు. 2021-22 నీటి సంవత్సరానికి కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా విషయమై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కృష్ణా జలాల్లో ఈ ఏడాది నుంచి చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ అంటోంది. తమకు 70 శాతం కృష్ణా జలాలు ఇవ్వాలని ఏపీ అంటోంది. కృష్ణా జలాల్లో వాటా పెంచాలని రెండు రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో భేటీలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.

ఒక సంవత్సరం కేటాయించిన వాటాలో మిగిలిన జలాలను మరుసటి ఏడాదికి లెక్కించాలన్న తెలంగాణ ప్రతిపాదన, వరద వచ్చినపుడు నీటి వినియోగం, తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, వాటి డీపీఆర్​లు ఇవ్వడం, చిన్ననీటివనరులకు నీటి వినియోగం, ఏపీ గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున 45 టీఎంసీలు అధికంగా ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తి, బోర్డు నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా చర్చకు రానుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన అంశంతో పాటు రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలు కూడా కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రానున్నాయి.

గెజిట్ నోటిఫికేషన్​ అమలు కార్యాచరణపై..

అటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై సాయంత్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశం జరగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో రెండు బోర్డుల సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొంటారు. ఈ అంశంపై జరుగుతున్న సమావేశాలకు తెలంగాణ మొదటిసారి హాజరవుతోంది. ఉమ్మడి భేటీలో గెజిట్ అమలు కార్యాచరణపై చర్చిస్తారు. ఆర్నెళ్లలోగా నోటిఫికేషన్​ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిర్ధిష్ట గడువులతో కూడిన కార్యాచరణ, రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిన సమాచారం, వివరాలు, రెండు రాష్ట్రాల నుంచి ఒక్కో బోర్డుకు 200 కోట్ల రూపాయల నగదు తదితర అంశాలపై చర్చ జరగనుంది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు తీసుకోవాల్సిందేనని, లేదంటే ఆ ప్రాజెక్టుల పనులను ఆపివేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్​లో కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై సంయుక్త సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చదవండి: KRMB MEETING: కృష్ణా జలాల్లో సగం వాటే లక్ష్యం.. బలమైన వాదనలతో ప్రభుత్వం సిద్ధం

Last Updated : Sep 1, 2021, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details