KRMB MEET: వచ్చే నెల 6న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు. గెజిట్ అమలు, బోర్డు నిర్వహణ, కృష్ణా జలాల పంపిణీపై చర్చ జరగనుంది. కేఆర్ఎంబీ బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ అప్పగించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల డీపీఆర్‌లు, విద్యుత్ ఉత్పత్తి, డ్యామ్ సేఫ్టీ, ఆర్డీఎస్, శ్రీశైలం, సాగర్‌రూల్ కర్వ్‌లు, చిన్ననీటిపారుదల, ఏపీకి బోర్డు తరలింపుపై బోర్డు సభ్యులు రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించనున్నారు. బోర్డు నిర్వహణ, వచ్చే ఏడాదికి బడ్జెట్, రెండు రాష్ట్రాల వాటాతో పాటు జూన్ నుంచి ప్రారంభమయ్యే 2022-23 సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల వినియోగంపై సమావేశంలో చర్చిస్తారు.
KRMB MEET: మే 6న కేఆర్ఎంబీ సమావేశం.. కృష్ణా జలాల పంపిణీపై చర్చ - ప్రాజెక్టులపై చర్చ
18:10 April 26
KRMB MEET: గెజిట్ అమలు, బోర్డు నిర్వహణ, కృష్ణా జలాల పంపిణీపై చర్చ
కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేయడం, బోర్డుకు రెండు రాష్ట్రాలు సీడ్ మనీ ఇవ్వడం అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అనుమతుల్లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పణను కూడా ఎజెండాలో పొందుపరిచారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, జలాశయ నిర్వహణ, పరస్పర ఫిర్యాదులపై సమావేశంలో చర్చిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల డ్యాంల భద్రత అంశం కూడా ఎజెండాలో ఉంది. శ్రీశైలం డ్యాం మరమ్మత్తులకు రూ.800 కోట్లు, సాగర్ మరమ్మత్తులకు రూ.20 కోట్లు, పులిచింతల మరమ్మత్తులకు పది కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రత్యేకించి శ్రీశైలం డ్యాంకు అత్యవసరంగా మరమ్మత్తులు చేయాలని పేర్కొన్నారు. చిన్ననీటి వనరుల ద్వారా వినియోగించిన నీరు, ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా బోర్డు తరలింపు అంశాలు ఎజెండాలో ఉన్నాయి.
ఇవీ చూడండి:KRMB-GRMB: పూర్తిస్థాయి సమావేశానికి నదీ యాజమాన్య బోర్డులు సిద్ధం
పాలమూరు-రంగారెడ్డి పనులపై ఎన్జీటీకి కేఆర్ఎంబీ నివేదిక.. ఏపీ సర్కార్ అభ్యంతరం!