Komatireddy Rajagopal Reddy Joined Congress :మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.సంతోశ్‌కుమార్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
దిల్లీలో ఉన్న ఠాక్రే, రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రవీందర్‌రెడ్డికి బాన్సువాడ టికెట్‌పై హామీ లభించినట్లు తెలిసింది. కాగా మరోవైపు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. తుంగతుర్తి టికెట్‌ను ఆశిస్తున్న మోత్కుపల్లి.. గురువారం రోజున పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు.
Telangana Congress joinings :రెండురోజుల క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు నాడు కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరినా, నేడు బీజేపీ నుంచి హస్తం పార్టీలోకి తిరిగి వెళ్తున్నా తన లక్ష్యం మాత్రమే ఒకటేనని అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని.. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వివరించారు.