తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న నీటి వివాదాల నేపథ్యంలో మరో జల సాధన ఉద్యమం అనివార్యమని వక్తలు పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల కోసం ఐక్య ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెజస అధినేత ప్రొఫెసర్ ఎం. కోదండరాం కోరారు. జల సాధన ఉద్యమానికి పూనుకొని న్యాయం పొందాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదులపై బోర్డులు ఏర్పాటు చేసి గెజిట్ విడుదల చేయడం.. ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు పెట్టినట్లయిందని ఆక్షేపించారు. ఈ అంశం... ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టించకముందే.. సామరస్యంగా చర్చించడం ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఒక సమగ్రమైన జల విధానం తీసుకురావాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
రెండు రాష్ట్రాలకు నష్టమే
కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల ద్వారా నీటి కేటాయింపులు జరపకుండా ఏకంగా బోర్డులు ఏర్పాటు చేసి గెజిట్ విడుదల చేయడం అశాస్త్రీయమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తప్పుబట్టారు. అశాస్త్రీయమైన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. అక్టోబరు 14 తర్వాత ఈ గెజిట్ అమల్లోకి వస్తున్న దృష్ట్యా... రెండు రాష్ట్రాలకు ఇబ్బందే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అధిక నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారం కోసం కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి సమస్య పరిష్కరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌కుమార్ సూచించారు. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి జల వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.