Kishan Reddy: కొవిడ్‌తో రెండేళ్లకుపైగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ-వీసా, ఫ్రీ వీసా విధానంతో 170 దేశాల విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తామన్నారు. జాతీయ సంస్కృతి మహోత్సవం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రోత్సాహకంగా ముందుకొచ్చిన 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఈ-వీసాలు ఉచితంగా ఇవ్వబోతున్నామని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఏప్రిల్ 12, 13 తేదీల్లో దిల్లీలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆక్రమణలకు గురవుతున్న గోల్కొండ కోట సహా పురాతన కట్టడాల సంరక్షణకు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కఠిన చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. ఇది అటవీ చట్టం తరహాలో ఉండాలని ప్రధానితో మాట్లాడతామన్నారు.
రామప్ప ఆలయానికి రూ.50 కోట్లకు పైగా నిధులివ్వాలని నిర్ణయించామని కిషన్‌రెడ్డి తెలిపారు. పర్యాటకాన్ని పెంచేందుకు 3,600 రైలుబోగీల్ని పర్యాటకశాఖ లేదా ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చే ఆలోచన కేంద్రం చేస్తోందన్నారు. దేశంలోని 75 పర్యాటకప్రాంతాల్ని అంతర్జాతీయ వసతులతో అభివృద్ధి చేస్తామని.. అందులో తెలంగాణ నుంచి ఎంపిక చేసే ప్రాంతాల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.