కొత్త చట్టంతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కొత్త చట్టం ప్రకారం అంగుళం భూమి కూడా ఇతరులు ఆక్రమించలేరని అన్నారు. అనివార్య కారణాల వల్ల వీఆర్‌వో వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వీఆర్‌ఏలలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని తెలిపారు. వీఆర్‌ఏలకు స్కేల్ పోస్టులు ఇస్తామని భరోసానిచ్చారు.
ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్ వీఆర్వోలకు ఉద్యోగ భద్రత ఉంటుంది.. వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తామన్నారు. భూవివాదాలపై తహసీల్దార్, ఆర్డీవో, జేసీలు ఆర్డర్ ఇస్తారని వివరించారు. ఆర్డర్లు ఇచ్చిన రెవెన్యూ అధికారుల వద్దే కోర్టులూ ఉన్నాయని తెలిపారు. ఇకనుంచి రెవెన్యూ కోర్టులు ఉండవని చెప్పారు. కొత్త చట్టంతో 99.99 శాతం ఆస్తుల తగాదాలు ఉండవని వెల్లడించారు. ఏమైనా సమస్యలుంటే న్యాయవిభాగం కోర్టులు పరిష్కరిస్తాయని వ్యాఖ్యానించారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో నిర్ణీత సమయంలోగా కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు.
ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు అని స్పష్టం చేశారు. తహసీల్దార్లకు వ్యవసాయ భూములే రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఉంటాయని చెప్పారు. గ్రామకంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తామన్నారు. ధరణి పోర్టల్‌లో పంచాయతీ, పురపాలిక, నగరపాలిక, జీహెచ్‌ఎంసీ ఆస్తుల వివరాలు ఉంటాయన్నారు.
ఎవరు ఎక్కడున్నా ఉన్నచోట నుంచే ఆస్తుల వివరాలు చూసుకోవచ్చని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందే అలాట్ చేయాలని సూచించారు. అలాట్ చేసిన వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ముందే ప్రజలు స్లాట్ అలాట్‌మెంట్ కోరాలని పేర్కొన్నారు. విద్యావంతులైతే డాక్యుమెంట్లు వాళ్లే రాసుకోవచ్చని చెప్పారు. కావాలంటే ఫీజు చెల్లించి డాక్యుమెంట్ రైటర్ సాయం తీసుకోవచ్చని అన్నారు.
క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పోర్టల్‌లో అప్‌డేట్ అవుతాయని అన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సహా అన్ని సేవలు ఏకకాలంలో పూర్తవుతాయని పేర్కొన్నారు. జీవితాంతం ఉపయోగపడేలా కుల ధ్రువపత్రం ఇస్తామని అన్నారు. ఆదాయ ధ్రువపత్రం డేటా బేస్ నుంచే ఇస్తామన్నారు. కొత్త బిల్లుతో వారసత్వ భూముల వివాదాలకు పరిష్కారమని చెప్పారు.
పాస్‌బుక్‌లోనే కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేస్తామని అన్నారు. త్వరలో తెలంగాణ డిజిటల్ మ్యాప్ తయారుచేస్తామని చెప్పారు. తెలంగాణ కుటుంబాల డేటా బేస్ అంతా పోర్టల్‌లో ఉంటుందని వివరించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీల వద్ద ఉన్న కేసులు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. సమగ్ర భూ సర్వే చేసి డిజిటల్ మ్యాప్ రూపొందిస్తున్నామన్నారు. డిజిటల్ మ్యాప్ ద్వారా ప్రజల ముందే భూముల సమగ్ర వివరాలుంటాయని వెల్లడించారు. ఆదాయం కోల్పోయినా కొత్త విధానం తేవాలని సంకల్పించామని అభివర్ణించారు.
ఇవీ చూడండి:శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం