KCR strategy for TRS victory in Munugoda Bypoll: రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో తెరాస సత్తా చాటింది. అధికార తెరాస, భాజపా మధ్య హోరాహోరీగా కొనసాగిన పోరులో భాజపాపై తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్‌గా భావించిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించి, సర్వశక్తుల్ని ధారపోశాయి. దేశ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న ఈ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేయగా.. సీఎం కేసీఆర్ తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోగా.. తెరాస-భాజపా మధ్య సాగిన ఈ ఉత్కంఠ పోరులో ‘కారు’ పార్టీ విజయానికి ఎగురేసుకుపోయింది.
ముందు నుంచే పక్కా ప్లాన్:కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరి పదవికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాలతో కొన్ని నెలల ముందు నుంచే తెరాస మునుగోడుపై దృష్టి కేంద్రీకరించింది. 2018 ఎన్నికల్లో కోల్పోయిన ఈ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలన్న కసితో బరిలో దిగింది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని పక్కా వ్యూహంతో అడుగులు వేసింది. ఈ సీటును అనేకమంది నేతలు ఆశించినప్పటికీ వాళ్లను కాదని 2014లో ఇక్కడ గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దించింది. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత బూర నర్సయ్యగౌడ్ లాంటి నేతలు పార్టీని వీడి భాజపాలో చేరినా ఏమాత్రం పట్టుసడలకుండా పార్టీ శ్రేణుల్ని భారీగా మోహరించింది. మండలానికో ఇన్‌ఛార్జిని నియమించి బూత్‌స్థాయి నుంచే నేతల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని విజయం కోసం అహర్నిశలూ శ్రమించింది.
వామపక్షాల మద్దతు: మునుగోడులో విజయం సాధించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలన్న భాజపా నేతల ఆశలపై కేసీఆర్ వ్యూహాలు నీళ్లు చల్లాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆగస్టు 20న అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో కమ్యూనిస్టులతో పొత్తును ప్రకటించడం ఆ పార్టీ విజయానికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు నల్గొండ జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉండేది. ఈ నియోజకవర్గంలో గతంలో వామపక్షాలు ఐదు పర్యాయాలు విజయం సాధించాయి. ప్రస్తుతం వామపక్షాలు బలహీనపడినా ఇక్కడ సీపీఎం, సీపీఐలకు గణనీయమైన ఓట్లు ఉన్నాయి. దీన్ని ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్ వామపక్షాల నేతలతో కలిసి మునుగోడుకు వెళ్లి సభలో పొత్తు అంశాన్ని ప్రకటించడం, ప్రచారంలోనూ వామపక్ష పార్టీల రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు చురుగ్గా పాల్గొని భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటి పరిణామాలు తెరాస అభ్యర్థి విజయానికి దోహదపడ్డాయి.
అభివృద్ధి పథకాలు.. పోల్ మేనేజ్‌మెంట్: మునుగోడులో భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించి రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను చూపించి ఓట్లు అడిగింది. మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మీ, రైతుబీమా తదితర పథకాలన్నింటినీ ప్రచారంలో భాగంగా చేసుకోవడంతో పాటు పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో చేపట్టిన పక్కా పోల్ మేనేజ్‌మెంట్ ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో వరుస సమావేశాలతో పాటు కేటీఆర్ వరుస పర్యటనలు, నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలపై దృష్టి, గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించడం వంటివి అధికార పార్టీ విజయానికి బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి.