జైలుకు వెళ్తాననే భయంతోనే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన: బండి సంజయ్ Bandi Sanjay on KCR: జైలుకు వెళ్తాననే భయంతోనే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌కు ఇంటిపోరు ఎక్కువైందని అన్నారు. చంపాపేటలోని మినర్వా గార్డెన్‌లో నిర్వహించిన భాజపా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
దారూసలాంను ఆక్రమిస్తాం..
భాజపా అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అక్రమ కేసులకు భాజపా కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించుకోవాలని విమర్శించారు. పాతబస్తీలో గణేష్ నిమజ్జనానికి సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు హాజరుకావటం లేదని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామని అన్నారు.
ఎంఐఎం ఆగడాలను భరించలేక
'భాజపాకు అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తాం. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని తెలంగాణ ఐకాన్‌గా పునర్నిర్మాణం చేసి చూపిస్తాం. పాతబస్తీ హిందువులకు అడ్డా.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారందిరనీ మళ్లీ ఇక్కడికి రప్పిస్తాం. హైదరాబాద్ పార్లమెంట్‌ను భాజపా ఎందుకు గెలవదో చూద్దాం. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణను విముక్తి కల్పిస్తాం.' - బండి సంజయ్
యూనిఫాంతో రావాలనటంలో తప్పేంటి?
తెలంగాణ గడ్డలో భాజపాకు మాత్రమే స్థానం ఉందని బండి సంజయ్ అన్నారు. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర భాజపా జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఎంఐఎం పార్టీని కేసీఆర్ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటని ప్రశ్నించారు. ముస్లిం మహిళలు ఓటు హక్కు వినియోగించకుండా.. ఫత్వా జారీచేసే పరిస్థితికి ఎంఐఎం వచ్చిందని అన్నారు.
ఇదీ చదవండి :'గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం'