ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేసీఆర్ తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా ఎల్బీ స్టేడియానికి చేరుకున్న సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘‘అనుకున్న విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గొప్పగా జరుపుకొన్నాం. అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చని ప్రపంచ మానవాళికి సందేశమిచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన గడ్డ మన దేశం. అటువంటి దేశంలో మహాత్మాగాంధీ గురించి, స్వతంత్ర పోరాటంలో ఆయన పాత్రపై నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం ఊరికే రాలేదు. ఎన్నో అమూల్యమైన త్యాగాలు, బలిదానాలు జరిగితేనే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. మనం స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నాం. కరోనా మహమ్మారి లాంటివి వస్తుంటాయ్.. పోతుంటాయ్.. స్వాతంత్ర్య ఉజ్వలత్వం, 75 ఏళ్లుగా స్వతంత్ర భారతంలో జరుగుతున్న విషయాలను గుర్తుచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా యువకులు, మేధావులు, ఆలోచనాపరులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాను’’
చూస్తూ మౌనం వహించడం సరైంది కాదు..‘‘ఇప్పటికీ దేశంలో పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయి. అడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తోంది. అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. చూస్తూ మౌనం వహించడం సరైంది కాదు. అర్థమై కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తామో.. ఆ సమాజం గొప్పగా పురోగమించేందుకు వీలుంటుంది. అద్భుతమైన వనరులు ఉన్న ఈ దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదు. ఈ స్వాతంత్ర్యం మనకు ఊరికే లభించలేదు. ఆ స్ఫూర్తితో కులం, మతం, జాతి అనే భేదం లేకుండా.. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది’’
తెలంగాణకే గర్వకారణం..‘‘ప్రతి ఇంట్లో స్ఫూర్తి రగిలేలా రోజుకో కార్యక్రమం చేపట్టాం. కోటి మందితో సామూహిక జాతీయ గీతాలాపన తెలంగాణకే గర్వకారణం. కొందరు అల్పులు గాంధీ గురించి నీచంగా మాట్లాడవచ్చు. గాంధీ సినిమాను 22 లక్షల మంది చూడడం గొప్ప విషయం. 10 శాతం గాంధీ స్ఫూర్తి నింపుకొన్నా దేశం పురోగమిస్తుంది. గాంధీజీ గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మర్చిపోకూడదు’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
ఇవీ చదవండి: