ఆర్టీసీ సమ్మె నేడు 15 రోజులకు చేరుకుంది. ఇవాళ ఐకాస రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర బంద్ పిలుపు నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టులో జరిగిన వాదనలు, కోర్టు సూచనలను అధికారులు, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావులు సీఎం కేసీఆర్కు వివరించారు. కోర్టు ఉత్తర్వులు శనివారం అందుతాయని చెప్పారు. దీనితో చర్చల విషయమై ఎలాంటి స్పష్టతకు రాలేదని సమాచారం.
అవసరమైన చర్యలు:
సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఆర్టీసీ బస్సులను యథాతథంగా నడపాలని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ బస్సులను నడిపేలా చూడాలని స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపితే ఇబ్బంది లేదని.. ఎవరైనా ఆటంకాలు కలిగించినా, చట్టాన్ని ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. బస్ స్టేషన్లు, డిపోల వద్ద పోలీసు బలగాలను అందుబాటులో ఉంచడం, నడిచే బస్సులకు రక్షణ సహా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.