Telangana Formation day 2022: హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నజరానా చెక్కును కేసీఆర్ ఆయనకు అందించి సన్మానించారు. అదే విధంగా మొగిలయ్య కోరినట్లు ఆయనకు బీఎన్‌రెడ్డి నగర్ కాలనీలో ఇంటిస్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది.
అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్న తెలంగాణ క్రీడాకారులకు సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఇటీవల టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్, జర్మనీలో జరిగిన ఐ.ఎస్.ఎస్.ఎఫ్. జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఇషా సింగ్‌లకు రూ.2 కోట్ల చొప్పున ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వారికి రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందజేసి సత్కరించారు. దీంతోపాటు నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాస స్థలాలను ప్రభుత్వం కేటాయించింది.