ఫోన్ కాల్‌తో ఆశ్చర్యపరిచిన సీఎం... మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్‌కు.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అతని సమస్యను అడిగి తెలుసుకున్నారు. తన ఏడెకరాల భూమిని ఇతరులకు వీఆర్వో కరుణాకర్ పట్టా చేశారని కేసీఆర్‌తో శరత్ ఆవేదన పంచుకున్నాడు. బాధితుని గోడును విన్న సీఎం... న్యాయం చేస్తామని అభయమిచ్చారు.
అసలేమైందంటే....
తన ఏడెకరాల భూమిని... వీఆర్వో హైదరాబాద్‌లో నివసిస్తున్న కొండపల్లి శంకరమ్మకు పట్టా చేశారన్నది శరత్ ఆరోపణ. తహసీల్దార్, సబ్ కలెక్టర్లకు ఫిర్యాదు చేసి 11 నెలలైనా... సమస్య తీరలేదు. ఇక లాభం లేదని ఫేస్‌బుక్‌లో తన ఆవేదన పంచుకున్నాడు. రైతుల వేదన సీఎంకు చేరే వరకు షేర్ చేయాలని తన ముఖచిత్ర స్నేహితులతో విజ్ఞప్తి చేశారు.
పోస్టు చూసి నేరుగా ఫోన్...
ఫేస్‌బుక్‌లో పోస్టును చూసి సీఎం కేసీఆర్...నేరుగా శరత్‌కు ఫోన్ చేశారు. న్యాయం చేయాలని మంచిర్యాల కలెక్టర్ హోళికేరిని ఆదేశించారు. వెంటనే నందులపల్లిలో శరత్ ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ చేపట్టారు.
మొత్తానికి ఓ ఫేస్ బుక్ పోస్ట్.. శరత్ సమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇవీ చూడండి:సిరిసిల్లకు రైలు రావాలంటే 16 ఎంపీలు గెలవాల్సిందే