తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS District presidents : తెరాస జిల్లా అధ్యక్షుల నియామకం.. ఎమ్మెల్యేలకు పెద్దపీట - telangana news

TRS District Presidents: రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా నియమితులైన అనంతరం నూతన అధ్యక్షులు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్​ పెద్దపీట వేశారు.

kcr appointed trs disrict presidents : తెరాస జిల్లా అధ్యక్షుల నియామకం.. ఎమ్మెల్యేలకు పెద్దపీట
kcr appointed trs disrict presidents : తెరాస జిల్లా అధ్యక్షుల నియామకం.. ఎమ్మెల్యేలకు పెద్దపీట

By

Published : Jan 27, 2022, 5:50 AM IST

Updated : Jan 27, 2022, 5:56 AM IST

TRS District Presidents: తెలంగాణ రాష్ట్ర సమితికి 33 జిల్లాల అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రకటించారు. 19 జిల్లాలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా నియమించారు. మూడు జిల్లాలకు ఎంపీలు, రెండు జిల్లాలకు ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు. మరో మూడు జిల్లాలకు జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఒక జిల్లాకు మాజీ ఎమ్మెల్యే, ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్‌ నేతలను నియమించారు. జిల్లా అధ్యక్షుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి అధ్యక్షులు వీరే. పార్టీలో మొదటి నుంచీ జిల్లా అధ్యక్షులు ఉండేవారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం పెరిగింది. వారికి మరింత గుర్తింపునిచ్చేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహుజన్‌ సమాజ్‌పార్టీ తరహాలో నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలనే అధ్యక్షులుగా చేయాలని సీఎం మూడేళ్ల క్రితం నిర్ణయించారు. జిల్లా కమిటీలను పరిహరించాలని భావించారు. దీనికి అనుగుణంగా నియోజకవర్గ కమిటీలు పనిచేశాయి. ఆ తర్వాత తెరాస అధిష్ఠానం జిల్లా కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించింది. వాటికి బాధ్యులుగా జిల్లా అధ్యక్షులను మళ్లీ నియమించాలనే నిర్ణయానికి వచ్చింది. తద్వారా 33 మంది సీనియర్‌ నేతలకు పదవులు లభించే అవకాశం వస్తుందని భావించింది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం గత నవంబరులో మరోసారి జిల్లా అధ్యక్ష నియామకాలపై చర్చ జరిగింది. మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో జిల్లా అధ్యక్ష కమిటీల నియామకాలను సీఎం వాయిదా వేశారు. దీనికి బదులుగా జిల్లా స్థాయిలో ఒకే నేత ఉండేలా కన్వీనర్లను నియమిస్తామని తెలిపారు. కన్వీనర్‌ పదవిపైనా తర్జనభర్జనల అనంతరం చివరికి సీఎం కేసీఆర్‌ జిల్లా అధ్యక్షుల నియామకం జరపడానికి నిర్ణయించారు.

సమన్వయ బాధ్యతలు

తెరాస జిల్లా అధ్యక్ష పదవులను పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలకు ఇవ్వడం ద్వారా వారిలో ఎలాంటి అసంతృప్తికి అవకాశం ఉండదని అధిష్ఠానం భావిస్తోంది. వాస్తవానికి అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలనే నియమించాలని సీఎం భావించినా... కొంతమంది ఎమ్మెల్యేలు ఇతరుల పేర్లను సూచించడంతో వారి వైపు సీఎం మొగ్గుచూపినట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, జడ్పీటీసీలతో సమన్వయంతో పనిచేసేలా జిల్లా అధ్యక్షులకు నిర్దేశించనున్నట్లు తెలిసింది.

రాష్ట్ర కమిటీపై చర్చ

గతంలో నియమిత పదవుల్లో ఎమ్మెల్యేలకు సీఎం పెద్దపీట వేశారు. ఈసారి జిల్లా అధ్యక్ష పగ్గాలను అప్పగించారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర కమిటీ నియామకంపై చర్చ మొదలైంది. రాష్ట్ర కమిటీలోనూ ఇదే తరహా విధానాన్ని కొనసాగిస్తారనే అంచనాలు మొదలయ్యాయి. ప్రొటోకాల్‌ సమస్యలు లేకుండా... విభేదాలకు ఆస్కారమివ్వకుండా సీఎం రాష్ట్ర కమిటీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. కాగా జిల్లా అధ్యక్ష పదవి ఆశించి దక్కని వారు కొందరు నిరాశచెందారు. వారు తిరిగి నియమిత పదవులకోసం ప్రయత్నించనున్నారు. తెరాస పార్టీ జిల్లాల కొత్త అధ్యక్షులు మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా పేరు జిల్లా అధ్యక్షులు
1 ఆదిలాబాద్‌ జోగు రామన్న
2 మంచిర్యాల బాల్క సుమన్‌
3 నిర్మల్‌ విఠల్‌ రెడ్డి
4 కుమురంభీం ఆసిఫాబాద్‌ కోనేరు కోనప్ప
5 నిజామాబాద్ జీవన్‌రెడ్డి
6 కామారెడ్డి ఎం.కె.ముజీబుద్దీన్‌
7 కరీంనగర్‌ రామకృష్ణారావు
8 రాజన్న సిరిసిల్ల తోట ఆగయ్య
9 జగిత్యాల విద్యాసాగర్‌రావు
10 పెద్దపల్లి కోరుకంటి చందర్‌
11 మెదక్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి
12 సంగారెడ్డి చింతా ప్రభాకర్‌
13 సిద్దిపేట కొత్త ప్రభాకర్‌ రెడ్డి
14 వరంగల్‌ అరూరి రమేశ్‌
15 హనుమకొండ దాస్యం వినయ్‌భాస్కర్‌
16 జనగామ సంపత్‌రెడ్డి
17 మహబూబాబాద్‌ మాలోతు కవిత
18 ములుగు కుసుమ జగదీశ్‌
19 జయశంకర్‌ భూపాలపల్లి గండ్ర జ్యోతి
20 ఖమ్మం తాతా మధుసూదన్‌
21 భద్రాద్రి కొత్తగూడెం రేగా కాంతారావు
22 నల్గొండ రవీంద్ర కుమార్‌
23 సూర్యాపేట లింగయ్య యాదవ్‌
24 యాదాద్రి కంచర్ల రామకృష్ణారెడ్డి
25 రంగారెడ్డి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
26 వికారాబాద్‌ మెతుకు ఆనంద్‌
27 మేడ్చల్‌ శంభీపూర్ రాజు
28 నాగర్‌కర్నూల్‌ గువ్వల బాలరాజు
29 మహబూబ్‌నగర్‌ సి.లక్ష్మారెడ్డి
30 వనపర్తి ఏర్పుల గట్టుయాదవ్‌
31 జోగులాంబ గద్వాల బి.కృష్ణమోహన్‌ రెడ్డి
32 నారాయణపేట ఎస్‌.రాజేందర్‌రెడ్డి
33 హైదరాబాద్‌ మాగంటి గోపినాథ్‌

ఇదీ చదవండి:

Last Updated : Jan 27, 2022, 5:56 AM IST

ABOUT THE AUTHOR

...view details