KC Venugopal on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. పీసీసీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు అంగీకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. మూడ్రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, 17న బహిరంగ సభ, 18న రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్ల విడుదల కార్యక్రమాలను నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. నిన్న హైదరాబాద్ పర్యటనలో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలతో కలిసి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలుచోట్ల బహిరంగ సభ ప్రదేశాలను పరిశీలించారు.
Telangana Congress MLA Candidates First List : నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా!
Hyderabad CWC Meeting Arrangements 2023 : బహిరంగ సభ కోసం మైదానాల పరిశీలన అనంతరం, హోటల్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీ వేణుగోపాల్.. సీడబ్ల్యూసీ సమావేశం, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ జాతీయ నేతలంతా హాజరవుతున్నందున ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్యనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలతో పాటు చాలా మంది నేతలు రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటారని తెలిపారు. సభ నిర్వహణకు పార్టీ నేతలతో ఆహార, రవాణా, సమన్వయ తదితర కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలకు మధుయాష్కీ, మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ఇతర నేతలు నాయకత్వం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ.. 5 హామీలపై గ్యారెంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియాగాంధీ విడుదల చేస్తారని తెలిపారు. ఈ గ్యారెంటీ హామీలను, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర నాయకులంతా ఐక్యంగా పని చేస్తేనే విజయం సాధ్యమని కేసీ వేణుగోపాల్ తెలిపారు.