Kavitha Tweet On Wrestlers Issue : రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నబ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Kavitha Tweet : కష్టపడేతత్వం, నిబద్ధత, దేశభక్తితో మహిళా రెజ్లర్లు ప్రపంచానికి భారతదేశ ప్రతిభను కనబరిచారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం.. ఇలాగేనా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన అభియోగాలు ఉన్న నిందితుడు బయట తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన రెజ్లింగ్ మహిళ క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రపంచమంతా చూస్తోందని.. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెజ్లర్లకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు : రెజ్లర్లకు తెలంగాణ ప్రభుత్వం తన మద్దతును ప్రకటించింది. బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ చేత రాజీనామా చేయడం కన్నా.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తోన్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అక్కడికి పంపించింది. దేశానికి పతకాలు సంపాదించి పెట్టిన రెజ్లర్లకు ఇదేనా గౌరవం అని ఆయన మండిపడ్డారు. దేశం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తోందని.. దేశ ప్రజలు, అన్ని రంగాల క్రీడాకారులు వీరికి మద్దతు తెలపాలని కోరారు.