Kaleshwaram Project Issue : మేడిగడ్డ ఆనకట్టతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) అంశానికి సంబంధించిన అన్ని విషయాలపై, ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లి సమీపంలోని లక్ష్మీ ఆనకట్ట ఇందుకు వేదిక కానుంది. నలుగురు మంత్రులు ఈరోజు మేడిగడ్డతోపాటు అన్నారం బ్యారేజీలను సందర్శించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు.
Congress Ministers visit Medigadda Barrage Today : రీడిజైనింగ్ ద్వారా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చడం, దాని వల్ల కలిగిన లాభనష్టాలు, మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు, అన్నారం బ్యారేజీ వద్ద సమస్యలు సహా అన్ని అంశాలపై మంత్రులు దృష్టి సారించనున్నారు. నలుగురు మంత్రులు, ఈఎన్సీ మురళీధర్ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ వద్దకు చేరుకుంటారు. అక్కడ నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు.
కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ
వైఎస్ హయాంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం, ప్రాజెక్టు వల్ల కలిగిన లాభనష్టాలు, కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు సహా అన్ని అంశాలను అందులో ప్రస్తావిస్తారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం తీసుకున్న రుణాలు, చెల్లింపులు, అవసరమైన విద్యుత్ తదితర అంశాలు ఉంటాయి.
మేడిగడ్డ ఆనకట్ట(Medigadda Barrage) కుంగుబాటుతోపాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా ప్రస్తావిస్తారు. మేడిగడ్డకు సంబంధించి ఉత్పన్నమైన సమస్యలు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ ప్రస్తావించిన అంశాలు సహా కేంద్ర జలసంఘం లేఖలు తదితరాలను కూడా ప్రస్తావించనున్నారు. అనకట్టలు, పంప్ హౌస్‌ల నిర్వహణ, వ్యక్తమైన అభిప్రాయాలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్-సీడీఓ రాసిన లేఖలు తదితర అంశాలను కూడా వివరించనున్నారు.