ఏపీలోని కడపజిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు మృత్యువాత పడ్డారు. గోటూరు వద్ద రెండు కార్లు.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి మూడు వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న నలుగురు స్మగ్లర్లు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు గాయపడగా.... వారిని రిమ్స్‌కు తరలించారు. వారిలో మూర్తి అనే స్మగ్లర్ చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
వెంబడించిన లోకల్ గ్యాంగ్
స్కార్పియో వాహనంలో ఎనిమిది మంది స్మగ్లర్లు.. ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు యత్నించారు. వీరంతా కడపజిల్లాలోని అడవుల్లో చెట్లను కొట్టి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించుకు వెళ్తున్నారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనాన్ని తీసుకెళ్తున్నారనే విషయాన్ని పసిగట్టిన జిల్లాకు చెందిన లోకల్ హైజాక్ గ్యాంగ్ వారి వాహనాన్ని వెంబడించింది. ఎక్కడైనా తమిళనాడు స్మగ్లర్లు ఎర్రచందనం తీసుకెళ్తుంటే.. వారి వెంటపడి వారి వద్దనున్న దుంగలను తస్కరించడం లోకల్ హైజాక్ గ్యాంగ్ పన్నాగం.
ఈ విధంగానే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో తమిళనాడుకు చెందిన స్కార్పియో వాహనంలో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలతో వెళ్తున్నట్లు లోకల్ హైజాక్ గ్యాంగ్‌కు సమాచారం అందింది. వెంటనే లోకల్ గ్యాంగ్ ఎటియోస్ వాహనంలో వెంబడించారు. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు స్మగ్లర్లు వేగంగా వాహనాన్ని నడుపుతూ వెళ్లారు. గోటూరు వద్ద టిప్పర్... కంకర్ అన్ లోడు చేసి రోడ్డు మలుపు వద్ద తిరుగుతుండగా... ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొట్టాయి. టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించి మూడు వాహనాలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలతో పాటు ఎనిమిది మంది స్మగ్లర్లలో నలుగురు సజీవ దహనం కాగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఓ స్మగ్లర్ పరారయ్యారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరో స్మగ్లర్ చనిపోయారు. ప్రస్తుతం ఇద్దరు స్మగ్లర్లు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ గ్యాంగ్ ముఠా సభ్యులు నలుగురు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.