తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేపటి నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు ధర్నా' - Dharna Agriculture Department offices

సాగు సమస్యల పరిష్కారానికై... ఈ నెల 11నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాఖ డివిజన్​, జిల్లా, మండల కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని.. తెలంగాణ రైతు సంఘం నిర్ణయించింది. సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరింది.

telangana rythu sangam, Dharna in front of Agriculture Department offices
'రేపటి నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు ధర్నా'

By

Published : Jun 10, 2021, 9:30 PM IST

రాష్ట్రంలో వానాకాలం సాగు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ మండల, డివిజన్‌, జిల్లా కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపింది. నైరుతి రుతు పవనాలు విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చోట్ల మెట్ట పంటలు వేస్తున్నందున... కల్తీ విత్తనాల బెడద తీవ్రంగా ఉందని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అందుబాటులో లేని విత్తనాలు

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చర్చించారు. ప్రభుత్వం ఇంత వరకు వ్యవసాయ, రుణ ప్రణాళిక విడుదల చేయలేదని దుయ్యబట్టారు. మండల కేంద్రాల్లో రైతులకు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో... ఒక అవకాశంగా తీసుకుని కల్తీ వ్యాపారులు దందా సాగిస్తున్నారని ఆరోపించారు.

కోట్ల విలువైన నకిలీ విత్తనాలు

పాలకూర నుంచి పత్తి విత్తనాల వరకు కోట్ల రూపాయల్లో విత్తనాలు పట్టుబడినట్లు కథనాలు వెలువడుతున్నాయని వాపోయారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించిన తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం ఒకేసారి కాకుండా... వాయిదాల్లో మాఫీ చేయడం వల్ల రైతులు బ్యాంకులకు బాకీపడి ఉండడం వల్ల తిరిగి కొత్త అప్పు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ఆ రైతులకు రుణాలు రాలే..

తెలంగాణ ఆవిర్భావించి 7 ఏళ్లు గడిచినా 60 లక్షల మంది రైతుల్లో 43 లక్షల మందికే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని... మిగతా 17 లక్షల మంది రైతులకు ఇంత వరకు బ్యాంకు గడప తొక్కలేదని తెలిపారు. మరోవైపు 2021-22కి వ్యవసాయ పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అశాస్త్రీయంగా ఉన్నాయని విమర్శించారు. గత సంవత్సరం మద్దతు ధరలపై 10-15 శాతం పెంచి మాత్రమే ప్రకటించిందని ఆయన ఆక్షేపించారు.

పెరిగిన ధరలు

ఇదే సందర్భంలో వ్యవసాయ ఉపకరణాల ధరలు 50 శాతం పెరిగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలను తగ్గించిందని చెప్పుకొచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌, ఇనుము, సిమెంట్‌, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయానికి వినియోగించే యంత్రాల ధరలు విపరీతంగా పెరిగాయని గుర్తు చేశారు. ఉత్పత్తుల అమ్మకం ద్వారా కంపెనీలు, వ్యాపారులు 100-150 శాతం లాభాలు సంపాదిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు

ABOUT THE AUTHOR

...view details