JNTU Team Visit Swapnalok building Fire Accident: గురువారం అగ్ని ప్రమాదానికి గురైన స్వప్నలోక్ భవనాన్ని జేఎన్టీయూ బృందం పరిశీలించింది. స్వప్నలోక్ బిల్డింగ్‌లోని నాలుగు, ఐదు, ఆరు అంతస్తులను జేఎన్టీయూ బృందం ప్రొఫెసర్ లక్ష్మి, హెచ్ఓడీ డీఎన్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భవనంలోని ఐదో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ.. నాలుగు, ఆరు అంతస్తుల్లో ఈ ప్రమాద తీవ్రత కారణంగా కొంత దెబ్బతిన్నట్లు బృంద ప్రతినిధులు నిర్ధారణకు వచ్చారు.
భవన నాణ్యతా ప్రమాణాలను, కాలమ్స్, బీమ్స్, స్లాబ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నివేదిక అందజేస్తామని తెలిపారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత భవనాన్ని కూల్చేయాలా లేక మరమ్మతులు చేయాలా అనే విషయంపై స్పష్టత వస్తుందని బృంద ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
గతంలో దక్కన్ మాల్ కూల్చివేత: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటన జరగడానికి ముందు జనవరి 19న సికింద్రాబాద్‌లోని దక్కన్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అప్పట్లో ఈ భవన నిర్మాణాన్ని పరిశీలించిన జేఎన్టీయూ అధికారులు ఏ క్షణమైనా భవనం కూలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని కూల్చివేశారు. ఐదంతస్తుల దక్కన్‌మాల్ భవనం కూల్చివేత ఐదురోజులు సాగింది.