తెలంగాణ

telangana

ETV Bharat / state

madhapur water: వడ్డెరబస్తీలో పెరుగుతున్న బాధితులు.. న‌ల్లాలకు ట్యాప్‌లు బిగించిన అధికారులు

madhapur
మాదాపూర్‌ వ‌డ్డెరబ‌స్తీ పెరుగుతున్న బాధితులు

By

Published : Apr 10, 2022, 4:19 PM IST

Updated : Apr 10, 2022, 8:13 PM IST

16:16 April 10

madhapur water: వడ్డెరబస్తీలో పెరుగుతున్న బాధితులు.. న‌ల్లాలకు ట్యాప్‌లు బిగించిన అధికారులు

వడ్డెరబస్తీలో పెరుగుతున్న బాధితులు.. న‌ల్లాలకు ట్యాప్‌లు బిగించిన అధికారులు

madhapur water contaminate:: హైదరాబాద్‌ మాదాపూర్‌లోని వడ్డెరబస్తీలో కలుషిత నీటి బాధితుల సంఖ్య 100కు చేరువైంది. శనివారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో మరో 15 మంది కొండాపూర్‌ ఆసుపత్రిలో చేరారు. మరో ఐదారుగురు కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు మొత్తం 26 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 52 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్య పెరగడంతో ఐదుగురికి గాంధీలో చికిత్స చేస్తున్నారు. కాలనీవాసుల అస్వస్థతకు కలుషితనీరు కారణం కాదని జలమండలి అధికారులు చెబుతున్నా ఇది నీటి వల్లే జరిగిందని కాలనీవాసులు అంటున్నారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

వడ్డెరబస్తీలో జలమండలి ఎండీ దాన కిశోర్‌ పర్యటించి బాధితులను పరామర్శించారు. నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని రోజుకు రెండుసార్లు పరిశీలించాలని ఆదేశించారు. అలాగే కాలనీలో 69 నల్లా కనెక్షన్లకు ట్యాప్‌లు బిగించారు. సగానికి పైగా నల్లా గుంతల పక్కనే మరుగుదొడ్లు ఉన్నాయన్న అధికారులు.. నీరు రివర్స్‌ అయితే కలుషితమయ్యే అవకాశముందని తెలిపారు. అయితే ఇప్పటికీ నీరు బాగా రావడం లేదని ప్రస్తుతానికి బయటినుంచే నీరు తెచ్చుకుని తాగుతున్నామని కాలనీవాసులు చెబుతున్నారు.

మా బస్తీ మొత్తం ఆస్పత్రిలోనే ఉన్నారు. మా బాబును ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా నీరు మంచిగా వస్తలేవు. అధికారులు ఇంటింటికి వాటర్ బ్యాటిల్స్ ఇచ్చిర్రు. నల్లాలు కూడా మార్చిర్రు. - బాధిత మహిళ

ఇప్పుడేమో ఫిల్టర్ వాటరే తాగుతున్నాం. గతేడాది నుంచి నల్లా నీరు తాగడం లేదు. మోరి నీళ్లు కలిసి వస్తున్నాయని తెలిసి మేం ఫిల్టర్ నీళ్లే తాగుతున్నాం. మోషన్స్ కావడంతో ఆస్పత్రికొచ్చాం. ఇప్పటికైతే బాగానే ఉంది. - బాధిత కుటుంబ సభ్యులు

మేం చికిత్స మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు కేసులు తగ్గాయి. ఓపీకి కూడా వచ్చేవారు తగ్గారు. ఇప్పటి నుంచి బాధితులు శుభ్రత పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు తీసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. ఇప్పటికైతే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. - చికిత్స అందిస్తున్న వైద్యులు

వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా వడ్డెర బస్తీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. బస్తీలో సుమారు 100 ఇళ్లు ఉండగా ఇంటింటికీ తిరిగి డయేరియా సర్వే నిర్వహిస్తున్నారు. కాలనీలో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా అంబులెన్సు ఏర్పాటుచేశారు. బస్తీవాసులకు అన్ని రకాల సలహాలు, సూచనలు అందిస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ పలువురు అస్వస్థతకు గురికావడం వడ్డెరబస్తీ కాలనీవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చూడండి:హైటెక్ సిటీలో కలుషిత నీరు తాగి 57 మందికి అస్వస్థత

Last Updated : Apr 10, 2022, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details