Jail theme restaurant: ఏపీలోని అనంతపురం నగరం రుద్రంపేట బైపాస్ పక్కనే ఉంది.. ఈ ప్రిజన్ హోటల్. లోనికి అడుగుపెట్టగానే జైలుకు వచ్చామనే భావన కలుగుతుంది. జైలుకు కాపలాగా ఉండే సెంట్రీ, ఎక్కడ చూసినా తుపాకులు, కారాగారంలో ఉంచే కత్తులు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లగానే ఖైదీ దుస్తుల్లో ఉన్న సర్వర్లు దగ్గరికి వచ్చి జైలు ఊచల తలుపు తెరిచి కటకటాల్లోకి పంపి తాళం వేస్తారు. ఇది రెస్టారెంట్ కాదు.. జైలే అన్న అనుభూతి కలుగుతుంది.
రెస్టారెంట్ వాతావరణం గుర్తుండిపోయేలా..
అనూష, మనోజ్, రఘువంశీలు కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తుండేవారు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. దీంతో.. దొరికిన ఖాళీ సమయం వ్యాపారానికి కేటాయించాలి అనుకున్నారు. రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకోసం.. వివిధ రెస్టారెంట్లు పరిశీలించగా.. ఆయా హోటళ్లు ఆహారం అందిస్తున్నాయే తప్ప వినియోగదారులకు సరికొత్త అనుభూతి ఇవ్వట్లేదని గుర్తించారు. రెస్టారెంట్‌కు వచ్చిన వారికి రుచితో పాటు.. అక్కడి వాతావరణం గుర్తుండిపోయేలా ఉండాలనుకున్నారు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే.. ది ప్రిజన్.