KTR Invited to Asia Berlin Summit 2023 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జూన్ 12 నుంచి 15వరకు జర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించనున్న ఆసియా-బెర్లిన్ సదస్సు 2023కు రావాలని కోరుతూ కేటీఆర్‌కు నిర్వహకులు ఆహ్వానం పంపారు. 'కనెక్టింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్' అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రసంగించాలని ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. జర్మనీ సెనేట్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా తెలంగాణతో పాటు భారత్, ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను మరింత పటిష్ఠం చేయాలని కోరింది.
జర్మనీ, ఆసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఏటా ఈ సదస్సును నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్టప్‌లను ఆసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది సదస్సులో మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుందని, అద్భుతమైన ఆలోచనలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టం బలాన్ని... ఆసియా ఖండంలోని స్టార్టప్‌లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.