రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విద్యాసంస్థలు ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు నగరానికి వచ్చి తమ పిల్లలను చదివిస్తుంటారు. దీనివల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం వేయి మంది దాటినవి ఉన్నాయి.
నగరంలో స్థలాభావం కారణంగా ఎంత మంది ఉన్నా ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రతి తరగతి గదిలో 30-40 మంది విద్యార్థులు ఉంటారు. శివారులోని ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క తరగతి గదిలో 60-70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి బెంచీకి ఇద్దరు, ముగ్గురు చొప్పున కూర్చుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తరగతుల గదుల సంఖ్య పెంచే వీలుండదు.
మూడు జిల్లాల్లో 2499 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే విద్యాభ్యాసం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలల్లో విద్యార్థుల మధ్య వ్యక్తిగత దూరం పాటించడం ఎలా సాధ్యమన్నది కీలకంగా మారింది. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో 1:40 విద్యార్థుల చొప్పున తరగతి గది డిజైన్ చేశారు. ఒకవేళ వ్యక్తిగత దూరం పాటించాల్సి వస్తే తరగతుల సంఖ్య పెంచాలి. ఇక ప్రైవేటు పాఠశాలలు చాలాచోట్ల ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఒక తరగతిని మూడు భాగాలుగా చేయాలంటే ఎంతవరకు సాధ్యమన్నది చూడాలి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుందనేది చూడాలని’ యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.సంజీవరావు వివరించారు.
వర్సిటీల్లోనూ అదే పరిస్థితి..!
నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ వ్యక్తిగత దూరం పెద్ద సమస్య కానుంది. వీటి పరిధిలో 5.5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీల్లో వసతిగృహాల్లో 12 వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. ఆయా కళాశాలలు, వర్సిటీల్లో సైతం తరగతి గదిలో కనీసం 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని అధికారులు వివరిస్తున్నారు.