2021 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పేర్కొంది. ఆ తర్వాత సీతారామ ఎత్తిపోతల పథకం కింద 2.88 లక్షల ఎకరాలు, దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 2.56 లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా నిర్ణయించింది. 2019-20వ సంవత్సరంలో 16 ప్రాజెక్టుల కింద 9.94 లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకోగా, వచ్చే ఆర్థిక సంవత్సరం దీనికి రెండున్నర రెట్లు ఎక్కువగా సాగునీటి వసతి కల్పిస్తామని పేర్కొంది.
2019-20లో ప్రతిపాదిత లక్ష్యంలో డిసెంబరు వరకు 34,617 ఎకరాలు, 2018-19లో 1.78 లక్షల ఎకరాలు సాధించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో కోటి ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 38 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, కరకట్టలు, ఆధునికీకరణ పనులను చేపట్టగా, వీటివల్ల 10.01 లక్షల ఎకరాల స్థిరీకరణ, 70.11 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందంది.
ఇప్పటివరకు 5 భారీ, ఆరు మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తయ్యాయని, నాగార్జునసాగర్ నుంచి 57 చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తయ్యాయని సాగునీటి డిమాండుపై ఇచ్చిన వివరణ నివేదిక పేర్కొంది. 2.97 లక్షల ఎకరాల స్థిరీకరణ, 17 లక్షల ఎకరాలలో వ్యవసాయాభివృద్ధి జరిగిందని, వచ్చే రెండు, మూడేళ్లలో 26 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి శ్రద్ధ తీసుకుంటామంది. మిషన్ కాకతీయ వల్ల 15.05 లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టును తిరిగి సాధించిట్లు వివరించింది.
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీటి వసతి కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పనులను 2021 నాటికి పూర్తి చేస్తామని, గోదావరి నుంచి ఎక్కువ నీటిని మళ్లించడానికి రోజుకు 2 టీఎంసీలకు అదనంగా మూడో టీఎంసీ నీటిని మళ్లించే పనులను చేపట్టినట్లు చెప్పింది. ప్రాజెక్టుల వారీగా వివరాలను వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేసే పనుల వివరాలను నివేదికలో ప్రస్తావించింది.
ఇవీ చూడండి:వైద్య సలహాలు మేం పాటిస్తాం.. మీరూ పాటించండి