Irrigation Is Difficult In Yasangi Season : యాసంగిలో ఇచ్చే సాగునీరు విషయమై హైదరాబాద్ జలసౌధలో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ సమావేశం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదల కింద సాగునీరు అందించే విషయమై సమావేశంలో చర్చించారు. వర్షాలు లేకపోవడం, ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
ఆయా ప్రాజెక్టుల కింద వానాకాలం పంటల సాగు కష్టంగా కొనసాగింది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో కేవలం తాగునీటి అవసరాల మేరకే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో మాత్రం నీరు ఉంది. ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుతం నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా యాసంగిలో సాగునీరు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Telangana Irrigation Projects Water Level : ప్రతిపాదనలపై టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజినీర్లతో ఈఎన్సీ మురళీధర్ చర్చించారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని యాసంగిలో ఎంతఆయకట్టుకునీరివ్వాలన్న విషయమై ఓ స్పష్టతకు వచ్చారు. 2023-24 యాసంగిలో మొత్తంగా 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇవ్వాలని నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. నిరుడు యాసంగిలో 33 లక్షల 65 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. ఈ సీజన్‌లో భారీ ప్రాజెక్టుల కింద 18 లక్షల 68 వేల 883 ఎకరాలకు మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2 లక్షల 18 వేల 535 ఎకరాలకు చిన్నతరహా వనరుల నుంచి 6 లక్షల 72 వేల 938 ఎకరాలకు ఐడిసి కింద లక్షా 35 వేల 223 ఎకరాలకు నీరు ప్రతిపాదించారు.
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - కేంద్రం నిధులు ఏం చేశారని నిలదీత
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 93 ఎకరాలకు నీరు : కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో 93 వేల 70 ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 78.66 టీఎంసీల నీరు ఉంది. 6.50 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు. మిగతా నీటిని యాసంగి సాగునీటి అవసరాలకు కేటాయించారు. శీరాంసాగర్ ప్రాజెక్ట్ మొదటి దశ కింద 8 లక్షల 28 వేల 297 ఎకరాలకు రెండో దశ కింద 3 లక్షల 26 వేల 914 ఎకరాలకు సాగునీరు ప్రతిపాదించారు. మధ్య మానేరు కింద 54 వేల 224 ఎకరాలకు, అలీ సాగర్ కింద 48 వేల 282 ఎకరాలకు, గుత్ప కింద 33 వేల 725 ఎకరాలకు, నిజాంసాగర్ కింద లక్షా 24 వేల 825 ఎకరాలకు ఆయకట్టు ప్రతిపాదించారు.