iRASTE project in Telangana : ఆర్టీసీ బస్సులు నిత్యం రహదారులపై తిరుగుతుంటాయి. డ్రైవర్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఎదురుగా వస్తున్న వాహనాల తప్పిదాల వల్ల ఆర్టీసీ బస్సులకు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రమాదాలు నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సహకారంతో ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ అనే ఐరాస్తే ప్రాజెక్టును విస్తరిస్తోంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇంటెల్ సంస్థ సంయుక్తంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాయి.
iRASTE project in Telangana News : ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్లపై ప్రమాదాలు నివారించేందుకు ఆర్టీసీ బస్సుల్లో.. సెన్సార్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి కృత్రిమ మేథ, మిషన్ లెర్నింగ్ సాంకేతికత ఆధారంగా పని చేస్తాయి. బస్సులో ఉన్న సెన్సార్లు ప్రమాద కారకాలను గుర్తించి ట్రిపుల్ ఐటీలోని కంట్రోల్ సెంటర్కు సందేశాలు పంపుతాయి. బస్సు అతివేగంతో ప్రయాణిస్తున్నా.. ముందున్న వాహనాలకు మరీ దగ్గరగా వెళ్లినా, రోడ్ల పరిస్థితి సరిగా లేకున్నా, రోడ్డు మార్జిన్ పాటించకపోయినా డ్రైవర్ను అప్రమత్తం చేసేలా సెన్సార్లు సిగ్నల్స్ ఇస్తాయి. దీనివల్ల బస్సును నియంత్రించి ప్రమాదాలు తప్పించేందుకు వీలవుతుంది. ప్రమాదాలూ తగ్గుతాయి.