తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చే రెండు నెలల్లో వైరస్‌ ఉద్ధృతి కొంత తగ్గొచ్చు'

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో టీకాలపై ప్రయోగాలను గమనిస్తే.. అవి సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే వరకూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. -డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు

'వచ్చే రెండు నెలల్లో వైరస్‌ ఉద్ధృతి కొంత తగ్గొచ్చు'
'వచ్చే రెండు నెలల్లో వైరస్‌ ఉద్ధృతి కొంత తగ్గొచ్చు'

By

Published : Aug 25, 2020, 6:14 AM IST

అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావమున్న కరోనా వైరస్‌ను నిలువరించగలిగే శక్తిసామర్థ్యాలు ప్రజలకే ఉన్నాయనీ, మనం కట్టుదిట్టంగా ఉంటే వైరస్‌ తన స్వభావ తీవ్రతను తగ్గించుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, భారతీయ ప్రజారోగ్య సంస్థ ఛైర్మన్‌, ప్రఖ్యాత హృద్రోగ వైద్యనిపుణుడు డాక్టర్‌ శ్రీనాథరెడ్డి స్పష్టం చేశారు. మనం పాటించే నియమాలే మనల్ని వైరస్‌ నుంచి రక్షిస్తాయని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొవిడ్‌ తీవ్ర రూపం దాల్చే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. వచ్చే రెండు నెలల్లో దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అంచనావేశారు. ప్రపంచ దేశాల్లో పరిశీలిస్తే.. కేసుల తీవ్రత తగ్గిన దేశాల్లోనూ మళ్లీ వైరస్‌ విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో వైరస్‌ తీరూతెన్నూ, భారత్‌లో కొవిడ్‌ ఉద్ధృతి, టీకాలు, చికిత్సలపై ప్రయోగాలు తదితర అంశాలపై డాక్టర్‌ శ్రీనాథరెడ్డితో ‘ఈటీవీ భారత్ ముఖాముఖి.

దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితి ఎలా ఉంది?

కేసులు చాలా త్వరితంగానే పెరుగుతున్నాయి. ముందుగా వైరస్‌ ప్రవేశించి పెద్దఎత్తున కనిపించిన చోట ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. కానీ కొంత తగ్గుముఖం పట్టింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలలో కొంత నియంత్రణలోకి వచ్చింది. హైదరాబాద్‌లోనూ కొంత తగ్గుముఖం పట్టినా ఇంకా సమస్య ఉంది. ఇంతకుముందు వరకూ వైరస్‌ తాకిడి ఎక్కువగా లేని బిహార్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో.. చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో.. ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు జాగ్రత్త పడితే వైరస్‌ను అదుపులోనే ఉంచవచ్చు.

బాగా చదువుకున్న దేశాల్లోనూ ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నారు?

కొంచెం మూర్ఖత్వం.. కొంత లెక్కలేనితనం.. దక్షిణ కొరియాలో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించి గుంపులు గుంపులుగా సంచరించారు. అమెరికాలోనూ అదే తీరు. చాలాచోట్ల యువత మాకేం కాదులే అనే భావనతో పార్టీలకు, పర్యటనలకు వెళ్తున్నారు. ప్రజలు ప్రవర్తించే విధానాన్ని బట్టే వైరస్‌ స్పందించే తీరు ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.

కొవిడ్‌ కనిపించిన తొలినాళ్లకు ఇప్పటికీ వైరస్‌లో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా?

బయలాజికల్‌గా వైరస్‌ ప్రవర్తన కొంత మారిందనీ, తీవ్రత కూడా కొంత తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు స్పెయిన్‌లో మళ్లీ వైరస్‌ కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నా.. ముందు వచ్చినంత తీవ్రతతో కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది. స్వాభావికంగా ఏమవుతుందంటే.. వైరస్‌ అడవి జంతువుల్లో ఉన్నప్పుడు.. దాని ప్రవర్తన చాలా స్వల్పంగా ఉంటుంది. అది అడవి జంతువులనే చంపేస్తూ.. అక్కడే ఉంటే వైరస్‌ సంతతి పెరిగే ఆస్కారం లేదు. కానీ అది ఉన్నట్టుండి బయటకొచ్చి ప్రజల్లోకి ప్రవేశిస్తే.. దానికి ఒకచోట నుంచి మరోచోటుకు కదలడానికి పెద్దసంఖ్యలో మనుషులు లభిస్తారు. అప్పుడది ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతుంది. వైరస్‌ కొన్నాళ్లు విరుచుకుపడినా కూడా.. అది తగ్గక తప్పదు. ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తుల సంఖ్య పెరిగినా కొద్దీ దాని ఉద్ధృతి తగ్గుతుంది. మనం కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలను పాటిస్తే.. దాని వ్యాప్తి నిలిచిపోతుంది.

మన దేశంలోనూ ప్రధాన నగరాల్లో తగ్గుముఖం పట్టడానికి ఇది కూడా ఒక కారణమవుతుందా?

అవును. ఇక్కడి ప్రజల వయసు, వాతావరణం.. ఇతర పరిస్థితులు కూడా వైరస్‌ ఉద్ధృతిని తగ్గించాయనే అభిప్రాయం ఉంది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే.. దక్షిణాసియా దేశాల్లో వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లతో పోల్చి చూస్తే.. మన దగ్గరే ప్రతి లక్ష మందికి చనిపోయే వారి సంఖ్య ఎక్కువ. అందుకని వైరస్‌ తన స్వాభావాన్ని మార్చుకుంటుందని చెప్పొచ్చు. ఒకసారి స్థిరపడిన తర్వాత నైజం మారుతుంది. అయితే మున్ముందు ఎలా ప్రవర్తిస్తుందనేది ఇప్పుడే చెప్పలేం.

అక్టోబరుకల్లా కొంత తగ్గొచ్చు అంటున్నారు?

తగ్గుముఖం పడుతుందనేది నా అంచనా కూడా. అయితే ఈ విషయాన్ని ఘంటాపథంగా ఎవరూ చెప్పలేరు. అక్టోబరులో కొంత తగ్గి, మళ్లీ శీతాకాలంలో విజృంభిస్తుందని కూడా చెబుతున్నారు. గట్టిగా చెప్పడానికి ఆధారాలేం లేవు.

వైరస్‌ తొలినాళ్లకు.. ఇప్పటికీ కొవిడ్‌ చికిత్సలో వచ్చిన మార్పులేమిటి?

వైరస్‌ వచ్చిన తొలినాళ్లలో ఎక్కువమందికి ఐసీయూ సేవలు అవసరమవుతాయనీ, వెంటిలేటర్లు పెద్దసంఖ్యలో సమకూర్చుకోవాలనే భయాందోళనలు ఉండేవి. కానీ ఇప్పుడది సరికాదని తేలిపోయింది. చాలామంది ‘ఇంటెన్సివ్‌ కేర్‌’ అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. తీవ్రంగా జబ్బుచేసిన వారిలోనూ చాలామందికి ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందిస్తే నయమైపోతుంది. దశలవారీగా చికిత్స అందించే విధానంపై స్పష్టత వచ్చింది. ఇప్పుడు రెండు మందులు మాత్రం పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ప్రాణాపాయం తగ్గించడానికి ‘డెక్సమెథసోన్‌’, ఆసుపత్రిలో చికిత్స వ్యవధి తగ్గించడానికి ‘రెమిడిసివిర్‌’ పనిచేస్తున్నాయి. ఆక్సిజన్‌పై ఉన్న రోగులకు ముందుగానే స్టెరాయిడ్స్‌ ఇస్తే దానివల్ల కొంత ఉపయోగం ఉంటుందనీ, దానివల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని ప్రయోగాత్మక చికిత్సలో తెలిసింది. ‘రెమిడిసివిర్‌’ వల్ల ప్రాణాపాయం తగ్గుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కానీ కోలుకునే వ్యవధిలో మాత్రం కొంత ప్రయోజనం కనిపిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. కొన్నివారాల్లో దాని ఫలితాలు కూడా బయటకు వస్తాయి. వచ్చే రెండు నెలల్లో ఏ మందు ఏ దశలో బాగా పనిచేస్తుందనే నిర్ధారణ చేసుకోవచ్చు.

ఈ మందులను తొలిదశలోనే, త్వరితగతిన ఇస్తే.. ప్రాణాపాయం వరకూ వెళ్లకుండా కూడా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు?

ఆక్సిజన్‌ అవసరం లేని వారికి స్టెరాయిడ్‌ ముందుగానే ఇస్తే.. రిస్కు కూడా ఉండొచ్చంటున్నారు. ఎందుకంటే మనకు రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) రెండు విధాలుగా ఉంటుంది. మొదటి ‘ఇమ్యూనిటీ’ వైరస్‌ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. దాని తర్వాత ఆలస్యంగా వచ్చే ‘ఇమ్యూనిటీ’.. వైరస్‌ ఎక్కడుంటే అక్కడ పట్టుకోవడానికి ఉన్నట్టుండి చాలా రసాయనాలను విడుదల చేస్తుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో ‘సైటోకైన్స్‌’ మన శరీరానికే హాని చేస్తుంటాయి. ఇటువంటప్పుడు స్టెరాయిడ్‌ ఔషధాలు పనిచేస్తాయి. కానీ వైరస్‌ స్వల్పంగా ఉన్నప్పుడు.. దానిపై దాడి చేయడానికి ‘స్టెరాయిడ్స్‌’ ఇస్తే నష్టం జరుగుతుంది. ఎందుకంటే అవసరమైన ఇమ్యూనిటీ కూడా స్పందించదు. అందుకే స్టెరాయిడ్స్‌ను అన్ని దశల్లోనూ ఇవ్వకూడదు.

టీకాల ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయి? ఎప్పటివరకు అందుబాటులోకి రావచ్చు?

టీకాల ప్రయోగాల్లో కూడా వేర్వేరు దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భాగస్వామ్యమైంది. టీకా పటుత్వంలో విజయవంతమవ్వాలి.. అది సురక్షితమైనదై ఉండాలి.. దాని పనితీరు మరీ తక్కువ కాలపరిమితికి ఉండకూడదు. టీకా వేసుకున్న తర్వాత రెండు మూడు నెలలకే ఇమ్యూనిటీ తగ్గిపోతే ఉపయోగం లేదు. అందుకని ఈ అంశాలన్నింటిని సంతృప్తిపర్చితేనే ఆ టీకా సమర్థతను ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణనలోకి తీసుకుంటుంది.

వైరస్‌ ఎప్పటికప్పుడూ తన రూపును మార్చుకుంటున్నప్పుడు.. టీకాలు పనిచేయవు అని వినిపిస్తోంది?

ఈ వాదన కూడా ఉంది. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ టీకాను 6-8 నెలల కోసమే తీసుకుంటున్నారు కదా. ఒకవేళ కరోనా టీకా కూడా 6 నెలలే పనిచేస్తుందనుకున్నా కనీసం అంతవరకైనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలం కదా? అడ్డుఅదుపూ లేకుండా వ్యాప్తి చెందేదాన్ని కొంత కాలం బంధించగలిగినా.. వైరస్‌ను బలహీనపర్చినట్లే అనే వాదన కూడా ఉంది.

మన కంటే ముందు వైరస్‌ సోకిన చైనా, ఇటలీ, స్పెయిన్‌, అమెరికా తదితర దేశాల్లో పరిస్థితి ప్రస్తుతం ఎలాఉంది?

చైనా చాలావరకు అదుపులో పెట్టింది. దేశంలో అంతర్గత రవాణాను వెంటనే నిలిపివేశారు. వూహాన్‌ను పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు. కానీ బీజింగ్‌లోకి మళ్లీ ఎక్కువమంది ప్రవేశించేటప్పటికీ తిరిగి కేసులు పెరుగుతున్నాయి. దాంతో అక్కడ మళ్లీ నిబంధనలు అమలు చేస్తున్నారు. విజయం సాధించామని చెప్పిన యూరప్‌ దేశాల్లో మళ్లీ వైరస్‌ ఉద్ధృతి కనిపిస్తోంది. స్పెయిన్‌లో మరీ ఎక్కువ తీవ్రతతో కేసుల సంఖ్య పెరిగింది. ఫ్రాన్స్‌లోనూ అంతే. అందుకని యూరప్‌ దేశాలు కూడా ఇప్పుడు ఈ వైరస్‌ దాడి నుంచి పూర్తిగా బయటపడ్డాయని చెప్పలేం. జపాన్‌లో కేసులు చాలా అదుపులో ఉన్నాయని భావించిన చోట ఇటీవల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హాంకాంగ్‌లోనూ అంతే. ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రంలో, న్యూసౌత్‌వేల్స్‌లోనూ కేసులు పెరుగుతుండడంతో.. ఈ రెండు రాష్ట్రాల నుంచి రాకపోకలు కొనసాగించకుండా నిబంధనలు పెట్టారు. న్యూజిలాండ్‌లో వంద రోజులు అసలు కేసులే కనబడలేదని చెప్పారు. అయితే ఉన్నట్టుండి కేసులు కనిపించాయి. వీలైనంత త్వరగా అదుపులోకి తేవాలనే ఉద్దేశంతో.. ఆక్లాండ్‌ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించారు. దక్షిణ కొరియాలోనూ కేసులు పెరిగాయి. ప్రజలు అజాగ్రత్తగా ప్రవర్తించడం వల్ల వైరస్‌ తీవ్రరూపం దాలుస్తోంది.

వైరస్‌తో కలిసి ఉండాల్సిన పరిస్థితుల్లో ఈ అప్రమత్తత ఎప్పటివరకు?

కేసులు తగ్గుతున్నా, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. జాగ్రత్తలు మాత్రం వదులుకోవద్దు. పెద్దపెద్ద గుంపులుగా చేరే ప్రదేశాలకు ప్రజలు దూరంగా ఉండాలి. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌, మే దాకా ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గాలి, వెలుతురు సరిగ్గా ప్రసారం కాని ప్రదేశాల్లో ఎక్కువమంది ఉండటం అంత మంచిది కాదు. బహిరంగ ప్రదేశాల్లోని గాల్లో వైరస్‌ ఎక్కువసేపు ఉండదు. అదే తలుపులు ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లోని గాల్లో ఎక్కువ సేపు ఉంటుంది. ఇటువంటి ప్రదేశాల్లో ఐదు గజాల వరకూ వ్యాప్తి చెందగలదు. వైరస్‌ వ్యాప్తిని మనం ఆపగలిగితే.. దాని తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే వైరస్‌ తన ఉనికిని కాపాడుకోవాలంటే.. మరొకరిలోకి వ్యాప్తి చెందాల్సిందే. మున్ముందు కూడా అది మన మధ్యనే ఉండొచ్చు. కానీ స్వభావం మార్చడానికి మనం కూడా దోహదం చేసినట్లు అవుతుంది. ‘వైరస్‌ వచ్చినప్పుడు విజృంభిస్తుంది. కొన్నాళ్లైన తర్వాత.. సరే నేనిక్కడ స్థిరపడి ఉన్నాను. వీళ్లలో కొందరినైనా బతకనివ్వకపోతే.. నేనూ బతకను అనుకొని దాని స్వభావం మార్చుకుంటుంది.’

టీకాను ప్రవేశపెడుతున్నామని రష్యా చెబుతోంది.. దీనిపై మీ విశ్లేషణ?

రష్యాకు చాలా ఏళ్ల నుంచి ఇమ్యునాలజీ, వ్యాక్సిన్ల తయారీలో బలముంది. కానీ వారు చెబుతున్న ఈ కరోనా టీకాను మూడోదశలో ప్రయోగించలేదు. ఇది చాలా ముఖ్యం. కానీ వాళ్లు ‘మొదటి, రెండో దశల్లో చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వాటిపై మాకు నమ్మకముంది. వేచి చూడాల్సిన అవసరం లేదు’ అంటున్నారు. అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. మూడో దశ ప్రయోగాలు అవసరంలేదని చట్టసవరణ కూడా చేశారు. అది ఎలా పనిచేస్తుందనేది చూడాల్సిందే. మామూలు పరిస్థితుల్లో అయితే.. మూడోదశ ప్రయోగాలు చేయకుండా.. దాని పనితీరును పూర్తిగా అర్థం చేసుకోకుండా.. సాధారణ ప్రజలకు ఇవ్వరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం.. ‘మూడో దశ ప్రయోగాలు చేయాలి. వాటి ఫలితాలు మేం చూడాలి’ అని చెబుతోంది. ఆక్స్‌ఫర్డ్‌ వాళ్లు సెప్టెంబరు నాటికి ఇస్తామంటున్నారు. మన దేశంలోనూ వచ్చే ఏడాది తొలినాళ్లలో వస్తుందంటున్నారు. భారత్‌లో టీకాను అభివృద్ధి చేయగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది.

ఇదీ చూడండి:కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ABOUT THE AUTHOR

...view details