మావోయిస్టుల కట్టడి దిశగా ప్రభావిత రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఒక రాష్ట్రంలో మావోయిస్టులకు ఇబ్బందులు తలెత్తితే పొరుగు రాష్ట్రంలోని సేఫ్ జోన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నందున అంతర్రాష్ట్ర ఆపరేషన్లు నిర్వహించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన ఏడు రాష్ట్రాల డీజీపీల ఆన్‌లైన్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ డీజీపీలు ఆపరేషన్ల వ్యూహంపై చర్చించారు. ప్రస్తుతం మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్రంగా ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇటీవల ములుగు జిల్లా వెంకటాపురంలో తెరాస కార్యకర్త భీమేశ్వరరావును ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు మిలీషియా దళం రాత్రిళ్లు హత్య చేసి తెల్లారేలోపు గోదావరి దాటి వెళ్లిపోయింది. ఈ తరహా ఘటనల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపైనా ఆపరేషన్లు చేపట్టనున్నారు. ఈ కార్యాచరణకు ఛత్తీస్‌గఢ్ నిఘా విభాగం ఐజీ ఆనంద్ చాబ్రాను నోడల్ అధికారిగా నియమించారు.
మావోయిస్టుల కట్టడికి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు... డీజీపీల భేటీలో నిర్ణయం - మావోయిస్టుల కట్టడి
మావోయిస్టుల కట్టడి దిశగా పలు రాష్ట్రాల పోలీసులు ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్లు చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఏడు రాష్ట్రాల డీజీపీల ఆన్‌లైన్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్రాష్ట్ర ఆపరేషన్లలో రాష్ట్రంలోని కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలే కీలకం కానున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దులైన తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కనిపించాయి. నాలుగు నెలల్లో కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 8 మంది మావోయిస్టులు మరణించారు. కొంతకాలంగా తెలంగాణలో సంచరించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ బృందాలు ఇటీవల దండకారణ్యానికి తిరిగి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తుండటంతో అంతర్రాష్ట్ర ఆపరేషన్లకు ప్రాధాన్యం సంతరించుకొంది.
ఇవీ చూడండి: స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు