పనివాళ్లుగా ఇళ్లలో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గుర్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బిహార్‌లోని మదుబని జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు రామాశిష్ ముఖియా, భాగవత్ ముఖియా, భోళా ముఖియాల నుంచి రూ. 1.50 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
రెక్కీ నిర్వహించి తర్వాతే చోరీ
ప్రధాన నిందితుడు భోలా ముఖియా వృత్తిరీత్యా డ్రైవర్. ఎప్పుడు, ఎక్కడ చోరీ చేయాలనేది ఇతడే నిర్ణయిస్తాడు. చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్న తర్వాత రెక్కీ నిర్వహించి ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటారు. కొన్ని రోజుల పాటు అనేక విధాలుగా పరీక్షించిన తర్వాతనే దొంగతనం చేయాలని నిర్ణయిస్తారు. ఆ తర్వాత చోరీ చేయాలనుకునే సమయానికి 10 నుంచి 15 రోజుల ముందు మిగతా ముఠా సభ్యులకు సమాచారం ఇస్తారు.