రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ వేడుకలా నిర్వహించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. వరంగల్ నిట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సదస్సుకు గవర్నర్ హాజరయ్యారు. అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించేందుకు కృషి చేయాలని తమిళిసై ఆకాంక్షించారు.
అప్పుడే సమానత్వం సాధ్యం..
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ-డిక్కీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దళిత మహిళలను ప్రోత్సహించడానికి డిక్కీ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. అనంతరం మల్లారెడ్డి మహిళా వర్సిటీ కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయని తెలిపారు.
అన్ని రంగాల్లో అతివలు..
ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య పెఢరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పేట్లబుర్జులోని నగర సాయుధ దళాల ప్రధాన కార్యాలయ ఆవరణలో మహిళా కానిస్టేబుళ్లకు క్రికెట్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ముఖ్య అతిథిగా హాజరైన మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు.