తెలంగాణ

telangana

ETV Bharat / state

Indian Cardiologists Heart surgery study : బైపాస్‌ సర్జరీల్లో భారతీయ నిపుణులు భేష్‌.. - తెలంగాణ హెల్త్ అప్డేట్స్

Indian Cardiologists Heart surgery study : మనదేశంలో బీటింగ్‌ హార్ట్‌ సర్జరీలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ సర్జరీల్లో నిపుణుడైన ప్రముఖ కార్డియోథొరాసిస్‌ సర్జన్‌ డాక్టర్‌ సజ్జా లోకేశ్వరరావు సహా ఏడుగురు వైద్య నిపుణులు అధ్యయనాన్ని చేపట్టారు. లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ’ నిపుణుల బృందం ఈ స్టడీ ఫలితాలను ఫిబ్రవరి సంచికలో ప్రచురించింది. ఈ అద్భుత విజయంపై డాక్టర్‌ సజ్జాను మంత్రి హరీశ్ అభినందించారు.

Heart surgery, Beating Heart study
బైపాస్‌ సర్జరీల్లో భారతీయ నిపుణులు భేష్‌

By

Published : Jan 31, 2022, 10:48 AM IST

Indian Cardiologists Heart surgery study : గుండె కొట్టుకుంటుండగానే బైపాస్‌ ఆపరేషన్‌ (బీటింగ్‌ హార్ట్‌) చేయడం మంచిదా? లేక హార్ట్‌ లంగ్‌ మిషన్‌ సాయంతో చేస్తే మంచిదా?.. వైద్యలోకంలో ఇదో పెద్ద ప్రశ్న. ఈ రెండింటిలో ఎలా చేసినా ఫలితాలు సమానంగానే ఉన్నాయని భారతీయ వైద్యనిపుణులు దేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో బీటింగ్‌ హార్ట్‌ సర్జరీలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ రకమైన సర్జరీల్లో నిపుణుడైన ప్రముఖ కార్డియోథొరాసిస్‌ సర్జన్‌ డాక్టర్‌ సజ్జా లోకేశ్వరరావు సహా ఏడుగురు వైద్య నిపుణులు అయిదు నగరాల్లో ఈ అధ్యయనాన్ని చేపట్టారు. డాక్టర్‌ లోకేశ్వరరావు దీనిని అంతర్జాతీయ వైద్య విజ్ఞాన వేదికలపై ప్రదర్శించగా ప్రశంసలు లభించాయి. లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ’ నిపుణుల బృందం ఈ స్టడీ ఫలితాలను ఫిబ్రవరి సంచికలో ప్రచురించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై గుర్తింపు పొందిన 16 అధ్యయనాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

వైద్య నిపుణులను అభినందించిన మంత్రి హరీశ్‌రావు

అధ్యయనంలో ప్రధానాంశాలివి.. పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్‌లో గుండె బైపాస్‌ సర్జరీ పొందే వారి వయసు చాలా తక్కువ. ఇతర దేశాల్లో 60-65 ఏళ్లలో బైపాస్‌లు జరుగుతుండగా భారత్‌లో సగటున 58 ఏళ్లే. ఈ సర్జరీ పొందినవారిలో మధుమేహులు 55 శాతం మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా 50 శాతం కంటే పైగా బైపాస్‌ చేయించుకున్న మధుమేహులు నమోదు కాలేదు. సాధారణంగా స్పందించే గుండె మీద బైపాస్‌ ఆపరేషన్‌ చేసేటప్పుడు ఎక్కువగా హార్ట్‌ లంగ్‌ మిషన్‌ మీదకు మార్చుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘క్రాస్‌ ఓవర్‌’ అంటారు. ఇలా క్రాస్‌ ఓవర్‌ తక్కువగా ఉన్న వైద్యులకు నైపుణ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. ఈ అంశంలో భారతీయ వైద్యనిపుణుల క్రాస్‌ ఓవర్‌ 0.6 శాతమే. అంటే భారతీయ కార్డియోథొరాసిక్‌ సర్జన్ల నైపుణ్యం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుస్తున్నట్లుగా తాజా అధ్యయనంలో స్పష్టం చేశారు. భారతీయ వైద్యులకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యంలో డాక్టర్‌ సజ్జా లోకేశ్వరరావు ఆదివారం వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఈ అద్భుత విజయంపై డాక్టర్‌ సజ్జాను మంత్రి అభినందించారు. వైద్య విజ్ఞాన పరిశోధనలకు ప్రభుత్వం తరఫున సహకారాన్ని అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డాక్టర్‌ సజ్జా లోకేశ్వరరావు ఇప్పటి వరకూ సుమారు 15వేలకు పైగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేశారు.

ఇదీ చదవండి:Naario masala : 400 మంది గృహిణులతో.. 'నారియో' మసాలా

ABOUT THE AUTHOR

...view details