ఇంటర్ వార్షిక పరీక్షలు మే 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలు ప్రారంభించి మే రెండో వారానికి పూర్తి చేయాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు.. మే 24 నుంచి చివరి విడత జేఈఈ మెయిన్ ఉన్నందున ఇంటర్ పరీక్షలను మే 3న ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు 19వ తేదీకి పూర్తవుతాయని తెలిసింది.
ప్రత్యక్ష బోధన 34 రోజులే!
ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ వరకు తరగతులు జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో 24 రోజుల చొప్పున, ఏప్రిల్‌లో 20 రోజులు కలిపి మొత్తం 68 రోజులు తరగతులు జరుగుతాయి. అయితే షిఫ్టు విధానం కాకుండా ఒక రోజు ప్రథమ సంవత్సరం, మరుసటి రోజు రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు జరపాలని తాజాగా ప్రభుత్వం సూచించింది. ఇది అమలైతే ఒక్కో ఏడాది విద్యార్థులకు 34 రోజులు మాత్రమే తరగతి గది బోధన అందుతుంది. ఈ విధానాన్ని ప్రభుత్వ కళాశాలలకే వర్తింపజేస్తారా? ప్రైవేట్‌లోనూ అమలు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
* ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు 300కు మించి ఉంటే షిఫ్టు విధానంలో కళాశాలలను నడపాలి. మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత కళాశాలల నిర్వహణ విధానం మారితే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తొలగించిన సిలబస్ నుంచి అసైన్‌మెంట్లు