రైతులు పండించిన పంటను ఆరబోసేందుకు ఉపాధి హామీ కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్లాల నిర్మాణం సహా ఇతర పనుల అంశం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతోంది. నిబంధనకు విరుద్ధంగా కల్లాల నిర్మాణం, ట్రీ ఏర్పాటు, ట్రెంచ్‌ల తవ్వకం, తదితర పనులు చేపట్టారని అభ్యంతరం తెలిపిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అందుకు ఖర్చు చేసిన రూ.151.91 కోట్లను బాధ్యులైన అధికారుల నుంచి రాబట్టి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఉపాధి హామీల పనుల పరిశీలన నిమిత్తం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందాల నివేదికల ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నవంబర్‌లో నోటీసు జారీ చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు: నవంబర్ 12న లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం బాధ్యులైన అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొంది. పక్షం రోజుల్లోగా రికవరీ చేయకపోతే జాతీయ ఉపాధిహామీ చట్టం ప్రకారం నిధులు ఆపివేస్తామని కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. కేంద్ర నోటీసులపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ నిధులను ఉత్పాదకత పనుల కోసమే వినియోగిస్తున్నామని, ఎక్కువ ఆంక్షలు పెట్టడం చట్టం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బ తీస్తుందని వివరణ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి