కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అధ్యాపకులతో రోజుకు రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం చేయించాలని ఇంటర్‌బోర్డు యోచిస్తోంది. దీనివల్ల మూల్యాంకన కేంద్రాల వద్ద అధ్యాపకుల రద్దీ తగ్గించవచ్చని భావిస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 11 స్పాట్ కేంద్రాల్లో 4 దశల్లో మూల్యాంకనం జరుగుతుంది. సాధారణంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జవాబుపత్రాలను దిద్దాలి. రోజుకు 30 మాత్రమే ఇవ్వాలి. కరోనా వైరస్ ప్రబలకుండా అధ్యాపకులను దూరంగా కూర్చోబెట్టాలని, మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు తప్పనిసరిగా సమకూర్చాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ను ఆదేశించారు.
ఒక్కో కేంద్రంలో వెయ్యి మందికిపైగా అధ్యాపకులు మూల్యాంకనానికి హాజరవుతారు. దూరంగా కూర్చోబెట్టాలంటే అంతమందికి స్థలం సరిపోదు. ఒక్కో బెంచీకి ఒకరికొకరు ఆనుకొని ముగ్గురు అధ్యాపకులు కూర్చుంటారు. దూరంగా కూర్చోవాలంటే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండాలి. ఈక్రమంలో రోజుకు రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం చేయిస్తే ఇబ్బంది ఉండదని ఇంటర్‌బోర్డు ఆలోచిస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిపితే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. మరోవైపు 10 రోజులపాటు మూల్యాంకనాన్ని వాయిదా వేయాలని అధ్యాపకులు కొందరు ఇంటర్‌బోర్డు అధికారులను కోరుతున్నారు. అయితే ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాలుండటం, అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాల్సి ఉండటం వల్ల వాయిదా వేస్తే ఫలితాల విడుదలపై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:మహారాష్ట్రకు కరోనా గండం- నాగ్‌పుర్‌లో 144 సెక్షన్