ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఆరు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఉండాలన్న నిబంధనలను సడలించింది. పదిహేను మీటర్ల వరకు భవనాలు అగ్నిమాపక శాఖ జాగ్రత్తలు తీసుకొని స్వీయ పూచీకత్తు ఇస్తే చాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో జారీ అయిన నిబంధనల ప్రకారం.. ఆరు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో జూనియర్ కళాశాల నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధన ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదిహేను వందలకు పైగా కళాశాలల్లో కేవలం 77కి మాత్రమే ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు లభించింది. అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం కళాశాలలు ఇంటర్ బోర్డుకు ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేకపోవడం వల్ల.. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పెండింగ్లో నిలిచిపోయింది.
90 శాతం నిబంధనలకు అనుగుణంగా లేవు
భవనాల నిర్మాణం, వైశాల్యం తదితర అంశాలు నిబంధనల ప్రకారం ఉంటేనే.. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ జారీ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సుమారు 90 శాతానికి పైగా కాలేజీ భవనాలు నిబంధనలకు అనుగుణంగా లేవు. గతంలో ఇలాంటి ప్రతిష్టంభన వచ్చినప్పుడు 15 మీటర్ల ఎత్తు వరకు మినహాయింపు ఇస్తూ 2017లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే పలు కార్పొరేట్ కళాశాలలు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నాయని గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సందర్బంలో 15 మీటర్ల వరకు మినహాయింపును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఈ ఏడాది గందరగోళంగా మారింది.