గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంకుర పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్... ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యక్రమానికి ప్రణాళిక చేశాయి. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కణల యాత్ర నిర్వహించాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా 4మార్గాల్లో 4బస్సుల్లో సుమారు 4వేల కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో ముగింపు కార్యక్రమం నిర్వహించి... ఉత్తమ ఆవిష్కరణలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపిక చేసిన 120 మంది విద్యార్థులు యాత్రలో పాల్గొననున్నారు.
వినూత్న ఆలోచనలను వీడియో తీసి పంపాలి..
ఈ యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను 90 సెకన్ల నుంచి 180 సెకన్ల వరకు వీడియో తీసి... 80740 18372 నంబరుకు వాట్సాప్ చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ ద్వారా అందిన ఆవిష్కరణలను పరిశీలించి... ఒక్కో విశ్వవిద్యాలయం పరిధి నుంచి 10 మంది చొప్పున 120మందిని ఎంపిక చేస్తారు. ఆవిష్కరణల యాత్రలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను భాగస్వామ్యం చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.