తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆందోళనల నడుమ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల వార్తలు

దాదాపు మూణ్నెళ్ల తర్వాత వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండగా కార్డు విధానంలో నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే మ్యుటేషన్​తో పాటు ఈ-పాస్​బుక్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడం పట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా సమస్యలను పరిష్కరించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

By

Published : Dec 14, 2020, 4:04 PM IST

Updated : Dec 14, 2020, 8:13 PM IST

రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో దాదాపు 95 రోజుల తర్వాత మళ్లీ సందడి మొదలైంది. హైకోర్టు తీర్పుతో స్లాట్ బుక్ చేసుకున్నవారికి ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఇళ్లు, స్థలాలు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి నిర్దేశిత సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తిచేస్తున్నారు. ప్రక్రియలో ఏమైనా సమస్యలుంటే హైదరాబాద్‌లోని వార్ రూంలో సాంకేతిక బృందంతో చర్చించి పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. …

కొత్త విధానంతో ఇబ్బందులు...

క్షేత్రస్థాయిలో మాత్రం చాలా ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి సరూర్​నగర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కొత్త విధానంతో ఇబ్బందులు పడినట్లు వివరించారు. దస్త్రాల పూర్వ చరిత్ర, సంబంధిత చిరునామా వివరాలు చూపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు...

ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఆస్తులకు సంబంధించి మాత్రమే స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించడంపైనా గందరగోళం నెలకొంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే వ్యవస్థ అని అధికారులు చెబుతున్నా... వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం రెండు స్లాట్‌లు మాత్రమే బుక్ అయ్యాయని అధికారులు తెలిపారు. చాలామంది కార్యాలయాలకు వచ్చి ఉసూరమంటూ వెనుదిరిగి వెళ్లటం కనిపిస్తోంది. 3 నెలలుగా ఎదురుచూస్తున్నా.. రిజిస్ట్రేషన్లు కాకపోవటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరసన..

పలుచోట్ల సర్వర్ పనిచేయకపోవడం వల్ల స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారులు కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఒక్క స్లాట్ నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో నగర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఆందోళన...

ప్రభుత్వం కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పనిలేకుండా పోయిందని... ప్రభుత్వమే ఆదుకోవాలని మేడ్చల్, సూరారం, అజంపుర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన నిర్వహించారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.

కొత్త విధానంతో మేలు...

అధికారులు మాత్రం కొత్త విధానంతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. స్వల్ప సాంకేతిక సమస్యలను త్వరలోనే అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు సేవలతో పాటు భూవివాదాలను అరికట్టొచ్చని వివరిస్తున్నారు. …

ప్రస్తుతానికి ఆయా కార్యాలయాల్లో 24 స్లాట్‌లకు అవకాశం ఇచ్చారు. రెండురోజుల్లో డిమాండ్‌ను బట్టి పెంచుతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయండి: చాడ

Last Updated : Dec 14, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details