ప్రయాణికుల భద్రతకు రైల్వేశాఖ (Indian Railways) అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ (South Central Railway zone)లో వర్షాకాలం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా కాపలాదారుల ఏర్పాటు, ట్రాక్‌పై చెరువుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడం, రిజర్వాయర్లు, డ్యాముల వద్ద నీటి స్థాయిని అంచనావేయడం, వాతావరణ, తుపాను హెచ్చరికలతో అప్రమత్తమవడం, ఎనిమోమీటర్ల ఏర్పాటు, నీటిస్థాయి పర్యవేక్షణ, అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవడం వంటి అంశాలపై రైల్వేశాఖ దృష్టిసారించింది.
కాపలాదారుల ఏర్పాటు...
వర్షాకాలంలో ట్రాక్‌ల పెట్రోలింగ్, చెరువులు, గుంతలు, వంతెనల వద్ద, గుర్తించిన బ్లాక్ సెక్షన్ల వద్ద కాపలాదారులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో ఏదైన సెక్షన్‌లో అసాధారణ వర్షపాతం, తుపాను నమోదైన సందర్భంలో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ పెట్రోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జోన్‌లో రైల్వే మార్గాన్ని ప్రభావితం చేసే సుమారు 1,900 చెరువులు, గుంతలను రైల్వేశాఖ గుర్తించింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు.
సమయాన్ని బట్టి...
చెరువుల పరిస్థితి, మరమ్మతులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి సమావేశాల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో డ్యాములు, రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైల్వే వంతెనలను సూక్ష్మంగా పరిశీలించేలా ఏర్పాటు చేశారు. దీంతో మిగులు జలాలను విడుదల చేసినప్పుడు రైల్వే సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయని అధికారులు భావిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి వచ్చే తుపాను హెచ్చరికలు, సమాచారాన్ని సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తగిన చర్యలు చేపట్టనున్నారు.
అనుకోని ఘటనలు సంభవించినా...
గుర్తించిన వంతెనల సమీపంలోని స్టేషన్ల భవనాలపై 30 ఎనిమోమీటర్లను ఏర్పాటు చేశారు. వీటితో గాలి వేగాన్ని ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ రైళ్ల రవాణా క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు. గుర్తించిన వంతెనలపై 12 ఆటోమేటెడ్ నీటిస్థాయి పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయడంతో నిరంతరం అక్కడి నీటిస్థాయి విలువలు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ భావిస్తోంది. వర్షాకాలం వరదలతో ఏవైనా అనుకోని ఘటనలు సంభవించినా వాటిని ఎదుర్కోవడానికి డివిజన్లలో గుర్తించిన ప్రాంతాల్లో స్టేషన్లు, గూడ్స్ వ్యాగన్లలో ట్రాక్, వంతెనల పునరుద్ధరణకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేసుకోవాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.