Independence Day Celebrations in BJP Office : బుజ్జగింపు, కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని.. దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఎంపీ డా.లక్ష్మణ్, ఇంద్రసేనా రెడ్డి, ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్, ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన వీరా రాజారెడ్డి తల్లిదండ్రులను కిషన్ రెడ్డి సన్మానించారు.
'స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. 2047 నాటికి పేదరిక నిర్మూలన జరగాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోంది. ప్రపంచమంతా మనవైపే చూస్తోంది' అని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'
Kishan Reddy Comments On CM KCR : మరోసారి కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. భూములు కనిపిస్తే చాలు అక్రమించేస్తున్నారని.. వేలం వేసేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పేరుతో రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. మరో పక్క రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని వాపోయారు. ప్రతి పని, ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం 30 శాతం వాటా తీసుకొని పాలన సాగిస్తోందని ఆరోపించారు.