పెళ్లి... అన్ని కుటుంబాల్లో పెద్ద వేడుక. యువతీ యువకులకు బంగారు కల. జీవిత భాగస్వామిపై ఎన్నో అంచనాలు. ఆశలు. పెళ్లంటే జీవితంలో ఒక్కసారే జరిగే శుభకార్యం. అది ఒకప్పుడు. కాలం మారింది. వధూవరుల ఆలోచనలు మారాయి. నచ్చకపోతే విడిపోవడమే. మరొకరిని వరించడమే. ఇదీ నేటి ధోరణి. ఒకప్పుడు రెండో పెళ్లంటే ఆక్షేపణ. ఇప్పుడది తప్పు కాదు. తొలి వివాహం విఫలమైతేనేం? అదొక పీడకలగా మర్చిపోతారు. మళ్లీ పెళ్లికి సిద్ధమవుతారు. ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో నడి వయసు వారూ ఉంటున్నారు.
రెండో పెళ్లి ఎందుకంటే...
ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. పిల్లలు గారాబంగా పెరుగుతున్నారు. అమ్మాయిలు పుట్టింట్లో దర్జాగా జీవిస్తారు. అత్తగారింట్లోనూ అలా లేకపోతే సమస్యే. ఏ మాత్రం తేడా వచ్చినా గొడవలే. చినికి చినికి గాలివానవుతుంది. విడాకులకు, పునర్వివాహానికి దారితీస్తుంది.కొందరు యువతీ యువకులు పెళ్లి ఆలస్యం చేస్తారు. చదువు, కెరీర్‌పై దృష్టి సారిస్తారు. అలా 30-35 ఏళ్లు వచ్చేస్తాయి. అప్పుడు సంబంధం దొరకడం కష్టమే. మొదటి పెళ్లి వారు దొరకరు. రెండో పెళ్లి వారైనా సరే అనాల్సిన స్థితి.
పరిచయ వేదికలకు గిరాకీ
పునర్వివాహం కోరే వారి కోసం ప్రత్యేక వేదికలుంటాయి. వీటిని ఆశ్రయించే వారు అధికంగానే ఉంటున్నారు. ‘మా వద్దకు నెలకు సుమారు 30 మంది రెండో పెళ్లి సంబంధం కోసం వస్తున్నారు’... అని కొన్ని పరిచయ వేదికల ప్రతినిధులు చెప్పారు. ఆన్‌లైన్ వేదికల్లోనూ ‘రెండో పెళ్లి’ విభాగాలున్నాయి. రెండో పెళ్లి చేసుకోవాలనుకునేవారు మరింత జాగ్రత్త పడుతున్నారు. వీలైనన్ని షరతులూ పెడుతున్నారు. మంచి సంబంధం కోసం ఏజెంట్లకు అధిక కమీషన్ ఆశ చూపే వారూ లేకపోలేదు.
జాగ్రత్త... జాగ్రత్త...
కొంతమంది అబ్బాయిలు ఆస్తికి ప్రాధాన్యమిస్తారు. అమ్మాయి ధనవంతురాలో, మంచి ఉద్యోగస్తురాలో అయితే చాలు. వాటి కోసమే ముందుకొచ్చే అబ్బాయిలుంటారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వేధింపుల వంటి నేరాలవల్ల తొలి వివాహం విఫలమవ్వచ్చు. అలాంటి పురుషులు రెండోపెళ్లి సమయంలో నిజం చెప్పరు. వీరి విషయంలోనూ నిశిత పరిశీలన అవసరం.