Telangana Weather Update : తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. పగటి వేళల్లో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భానుడి సెగల తాకిడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకురావడం లేదు. దీంతో పగటివేళల్లో రహాదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు జనం లేక వెలవెలబోతున్నాయి.
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు ఎండ తాకిడికి జనం బయటకి రాకపోవడంతో.. అమ్మకాలు లేక చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పితే జనం బయటకు రావటంలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే ఎండలు మండిపోవడం ఆరంభమైంది.
ఏప్రిల్ ద్వితీయార్థంలోనే నిజామాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా లక్మాపూర్‌లో 44.4, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 44.3, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కలపల్లిలో 44.1, రాజన్న సిరిసిల్ల జిల్లా నిజాంబాద్‌లో 43.9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడులో 43.8, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 43.3, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 43.2, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.0, నల్గొండ జిల్లా కట్టంగూరులో 42.8, వనపర్తి జిల్లా కేతిపల్లిలో 42.8 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Weather condition in Telangana: 2015 సంవత్సరం తరువాత ఏప్రిల్ మాసంలో అత్యధికంగా ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2015 ఏప్రిల్‌లో అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఖమ్మం జిల్లాలో నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తరువాత ఆ స్థాయిలో ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. రానున్న రోజుల్లో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. 44 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత ఈసారి అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో కూడా 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో 44 నుంచి 45, మే నెలలో 45కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో కేవలం మనుషులే కాకుండా పక్షులు, జంతువులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. పగటి వేళల్లో జనం బయటకు రాకపోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఉత్తరాది నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల తెలంగాణలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలపైన అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం జరగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గాలిలో గ్రీన్‌హౌస్ వాయువులు పెరగడంతో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఐతే, ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా ఒక కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జాగ్రత్తలు తప్పనిసరి: ఏటికేడు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఈ ఏడాది ఒక్కసారిగా నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రజలు హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో క్రమంగా పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పర్యావరణ వేత్తలు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బయట తిరుగకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.