ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపున్న కొవిడ్ బాధితునికి అత్యవసరంగా ప్లాస్మాథెరపీ అవసరమని వైద్యులు సూచించారు. ప్లాస్మాదాతలు దయచేసి ఈ నెంబరులో సంప్రదించగలరు.
మా సమీప బంధువు కొవిడ్ బారినపడ్డారు. ఆయన వయసు 65 ఏళ్లు. ఏ నెగెటివ్ బ్లడ్‌గ్రూపున్న ప్లాస్మాదాత వెంటనే సంప్రదించగలరు. మీ సాయాన్ని ఎప్పటికీ మరువలేం..
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో.. రోజుకు సుమారు 1500-1900 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో రోజుకు 30-50 మందిలో వైరస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.
ఇటువంటి వారిలో పరిస్థితి విషమించినప్పుడు.. ‘ప్లాస్మాథెరపీ’ని ప్రయోగాత్మక చికిత్సగా వైద్యులు అందిస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 37,745 మంది కరోనా బారినపడగా, వీరిలో 24,840 మంది కోలుకున్నారు. అయితే వీరిలో ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రి సహా రాష్ట్రంలోని ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ కలుపుకొని ప్లాస్మాను దానం చేసినవారు మాత్రం 100 మంది లోపే కావడం గమనార్హం. దీనికి రకరకాల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇందులో ప్రధానమైనవి..
- మొత్తం కోలుకున్నవారిలో దాదాపు 50 శాతం మంది అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుంటారని అంచనా.
- ప్రధానంగా 18-50 ఏళ్ల లోపు వారినుంచే ప్లాస్మాను సేకరిస్తారు. ఈ వయసు వారిలోనూ ఆరోగ్యవంతులు సుమారు 40 శాతం మంది ఉంటారని ఒక విశ్లేషణ. అంటే మొత్తం కోలుకున్నవారిలో 8-9 వేల మంది ఉంటారు.
- వీరిలోనూ కరోనా యాంటీబాడీస్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందినవారి నుంచే ప్లాస్మాను తీసుకుంటారు. కొవిడ్ లక్షణాలు బయటకు కనిపించకుండా, కేవలం పరీక్షల్లో కరోనా అని నిర్ధారణ అయి, ఎటువంటి సమస్యలు లేకుండా తగ్గిపోయిన వారిలో ఇలా యాంటీబాడీస్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- ఇలా లక్షణాలు లేనివారు కూడా దాదాపు 80 శాతం మంది ఉంటుండంతో.. వీరిలో ఎందరిలో యాంటీబాడీస్ పూర్తిగా అభివృద్ధి చెందాయి? ఎందరిలో అభివృద్ధి చెందలేదనే స్పష్టత మాత్రం ఇప్పటివరకూ లేదు.
- వీరిలోనూ సుమారు 50 శాతం మందిలో ప్లాస్మా ఇవ్వడానికి అనుకూలత లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే మరో 4 వేల మంది కూడా ప్లాస్మా ఇవ్వడానికి అర్హులు కారనేది తెలుస్తోంది.
- రక్తంలో హీమోగ్లోబిన్ శాతం 12.5 కంటే తక్కువగా ఉన్నా, 55 కిలోల బరువు కంటే తక్కువగా ఉన్నా కూడా ప్లాస్మా దానానికి అంగీకరించరు.
* ప్లాస్మా దానం చేసే సమయంలో ఎటువంటి వైరల్ వ్యాధుల బారిన పడి ఉండకూడదు. - ఈ అన్నింటిని పరిగణనలోకి తీసుకున్నా యాంటీబాడీస్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన కరోనా విజేతలు కూడా రాష్ట్రంలో సుమారు 5 వేల మంది వరకూ ఉంటారని అంచనా.
- ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఇప్పటివరకు ప్లాస్మా దానానికి ముందుకు రావడం గమనార్హం.
అపోహ.. బయటపడటం ఇష్టం లేక...