భాద్రపద శుద్ధచవితి నాడు భక్తితో కొలిచే గణనాథుడి పండుగ క్రమంగా గాడి తప్పుతోంది. పండుగ పరమార్థం మారిపోయేలా ఏటేటా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంప్రదాయలకు విరుద్ధంగా హంగులు, ఆర్భాటాలతో చవితి పండుగలో స్థోమతను చాటుకుంటున్నారు. అందరికంటే ఎత్తైన విగ్రహాలు పెట్టడం, లక్షలు ఖర్చు చేసి ఖరీదైన మండపాలు తీర్చిదిద్దడమే లక్ష్యంగా వినాయకుడి పండుగను జరుపుకుంటున్నారు. వినాయక చవితి అంటే పేరు, పరువు కోసం జరుపుకునే పండుగలా మారిపోయింది. ఇదంతా ఆనందాన్ని కలిగించే విషయమే అయినా సంప్రదాయ పద్ధతిలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం లేదని నగరంలోని సిద్ధి వినాయక ఆలయ పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎలా కొలిచినా పలుకుతాడు
వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు చక్కగా పండినప్పుడు చీడపీడలు, ఎలుకల ఉద్ధృతితో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు నాడు ప్రజలంతా ఏకదంతున్ని పూజించేవారు. వారి మొర ఆలకించిన బొజ్జ గణపయ్య... పంటల నష్టాన్ని నివారించి సిరిసంపదలు కురిపించేవాడు. దాంతో ఆనందోత్సాల మధ్య మేళతాళాలతో గణేశుడి పండుగను వేడుకగా జరుపుకునేవారు. కాలక్రమేణా ఈ పండుగ ప్రాశస్త్యం కనుమరుగైపోయిందని పూజారులు వాపోతున్నారు. పీవోపీ విగ్రహాలు పెట్టి పూజించడం వల్ల సహజ వనరులు కలుషితమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. అయితే ఎలా కొలిచినా పలికే ఆ గణనాథున్ని ప్రకృతిలో దొరికే వనరులతో ఆరాధిస్తేనే సంతోషిస్తాడంటున్నారు. పంచభూతాల్లో గణపతి రూపాన్ని తలిచి కొలిస్తేనే సకల జనులు సుభిక్షంగా ఉంటారని పూజారులు పేర్కొంటున్నారు.