Impact of Cyclone Mandous in Rayalaseema: మాండౌస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అంతటా జోరు వానలు పడుతున్నాయి. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరు సహా జిల్లాలోని పలు నగరాల్లో కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలోని నదులు, వాగులు పొంగి పొర్లుతుండగా..రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపింది.
తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు.. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.చిల్లకూరు మండలంలో ఉప్పుటేరు వాగు ఉద్ధృతికి సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ప్రవాహానికి పంట పొలాలు నీట మునిగాయి. చిత్తూరు జిల్లా పలమనేరులోని రంగాపురం సచివాలయం పరిధిలో వర్షానికి కరెంటు స్తంభం నేలకొరగడంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలింది.
ఎడతెరిపిలేని వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలోని ఇళ్లలోకి వాన నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగం మండల కేంద్రంలోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. సోమశిల జలాశయం నుంచి దిగువకు భారీగా నీరు వదలడంతో పరివాహక గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి.