రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ (ఐఐఎల్) ప్రకటించింది. పాదాలు, నోటి ద్వారా పశవులకు సంక్రమించే వ్యాధులు, ఇతర వ్యాధులకు సంబంధించిన టీకాల ఉత్పత్తి కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్, ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికలు వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రంతో 750 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీ ఏర్పాటుకు జీనోమ్ వ్యాలీలో సంస్థ పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రం సంవత్సరానికి 300 మిలియన్ డోస్‌ల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రంతో ఇప్పటికే సంస్థకు ఉన్న సామర్థ్యానికి అదనంగా సంవత్సరానికి మరో 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.