తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం స్వీట్ వార్నింగ్: ఒక్కటి ఓడినా... పదవులు ఊడతయ్! - తెలంగాణ పురపాలక ఎన్నికల వార్తలు

పొర‌పాట్ల‌కు ఛాన్స్ లేదు. ఎక్క‌డ తేడా వ‌చ్చినా ఊరుకునేది లేదు. త‌ప్పు ఎవ్వ‌రు చేసినా క్ష‌మించే ప్ర‌స‌క్తి లేదు. తెరాస నేత‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు నేప‌థ్యంలో జ‌రిగిన తెరాస విస్తృత స్థాయి స‌మావేశంలో సీఎం ఇలా స్పందించారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మీ ప‌ద‌వి పోవ‌డం ఖాయ‌మంటూ మంత్రులంద‌రినీ హెచ్చ‌రించారు. ఎక్క‌డా ఎలాంటి అసంతృప్తులూ ఉండ‌కూడ‌ద‌నీ, ఒక‌సారి అభ్య‌ర్థుల జాబితాను పార్టీ ప్ర‌క‌టించాక ఎవ్వ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌నీ, ఎన్నిక‌ల్లో వెన్నుపోటు పొడిచే రాజ‌కీయం చేస్తే ఊరుకునేది లేద‌ని కూడా హెచ్చ‌రించారు!

If a single seat is lost in the Telangana municipal elections, the ministerial posts will be lost.
ఒక్కటి ఓడినా... పదవులు ఊడతాయ్!

By

Published : Jan 6, 2020, 8:05 AM IST

Updated : Jan 6, 2020, 4:52 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరిక నేపథ్యంలో రాబోయే పురపాలక ఎన్నికలు మంత్రులకు పరీక్షగా మారనున్నాయి. మంత్రుల నియోజకవర్గాల్లోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల పరిధిలో ఒక్కటి కోల్పోయినా పదవులు ఉండవని సీఎం పేర్కొనడం పార్టీలో కలకలం రేపింది. గతంలో సీఎం వివిధ ఎన్నికల సందర్భాల్లో బాధ్యతల విషయమై మంత్రులకు ఉద్బోధ చేశారు. తొలిసారిగా ఆయన పదవులకు గండం అని ప్రస్తావించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మల్లారెడ్డికి సవాలు

రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలో మూడు నగరపాలక సంస్థలు, ఏడు పురపాలక సంఘాలున్నాయి. శనివారం జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటన్నింటా గెలుపు మంత్రికి సవాలుగా మారింది. ఇప్పటికే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డితో విభేదాలు బయటపడ్డాయి. అవి కొనసాగితే ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడం సానుకూల అంశం. దీనికితోడు మంత్రి కేటీఆర్‌ ప్రచారానికి వస్తే తమకు విజయం ఖాయమని నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌, భాజపాల నుంచి పోటీ ఉంది.

సబిత వ్యూహం

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఈసారి కొత్తగా బడంగ్‌పేట, మీర్‌పేట నగరపాలక సంస్థలుగా మారాయి. జల్‌పల్లి, తుక్కుగూడలు పురపాలక సంఘాలయ్యాయి. అన్నిచోట్లా గెలిచేందుకు మంత్రి సబితారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన తర్వాత ఆమె మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో సయోధ్యతో వ్యవహరిస్తున్నారు. జడ్పీటీసీ, మండల పరిషత్‌ స్థానాల్లో ఏకాభిప్రాయంతో పనిచేశారు. పురపాలక, నగరపాలక ఎన్నికల్లోనూ ఐక్యత కనిపిస్తోంది. ఇప్పటికే నాయకులతో సమావేశాలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేశారు. సబితారెడ్డి అనుభవం, కృష్ణారెడ్డి సహా ఇతర నేతల మద్దతు దృష్ట్యా నియోజకవర్గంలో ఆధిక్యం చాటుకుంటామని తెరాస అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ అన్నిచోట్లా పోటీ ఇవ్వనుంది. భాజపా కొన్నిచోట్ల ఢీకొడుతుంది.

ఈటల పంతం

హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలో రెండు పురపాలక సంఘాలున్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట స్థానాలలో విస్తృతస్థాయిలో ఈటల ప్రచారం చేపట్టారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. గత శాసనసభ ఎన్నికలలో కొంతమంది వ్యతిరేకంగా పనిచేసినట్లు గుర్తించిన ఆయన పురపాలక ఎన్నికల్లో ఈ సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నారు. పార్టీ సమావేశాల్లో వెన్నుపోట్ల గురించి ప్రస్తావిస్తున్నారు. రెండుచోట్లా గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ భాజపా అధికార పార్టీని ఎదుర్కోనుంది.

గంగులకు పట్టుదల

కరీంనగర్‌ నియోజకవర్గంలో నగరపాలక సంస్థ ప్రధానమైనది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి గంగుల పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ప్రచారం మొదలైంది. అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. జిల్లా కేంద్రం కావడం, టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో అందరి దృష్టి కరీంనగర్‌పై కేంద్రీకృతమవుతోంది. సీఎం కేసీఆర్‌ ఇటీవల కరీంనగర్‌ పర్యటన సందర్భంగా గంగులకు, నేతలకు పలు సూచనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో భాజపా ఎంపీ స్థానం గెలిచింది. ఆ పార్టీ, కాంగ్రెస్‌లు పురపాలక ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తెరాసకు బలమైన శ్రేణులు ఉండడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు సాధిస్తామని గంగుల ఆశాభావంతో ఉన్నారు.

శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకం

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని ఏకైక పురపాలక సంఘం జిల్లా కేంద్రంలో ఉంది. మంత్రికి ఈ స్థానం ప్రతిష్ఠాత్మంగా ఉంది. పట్టణంపై దృష్టి సారించి అభివృద్ధి పనులను పెద్దఎత్తున చేయించారు. విస్తృతంగా సమావేశాలు, పర్యటనలు జరుపుతున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు లేవు. ఆశావహులతో ఇప్పటికే పలు దఫాల సమావేశాలను నిర్వహించిన మంత్రి ఏకాభిప్రాయ సాధనకు యత్నిస్తున్నారు. టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌ ప్రత్యర్థులుగా నిలుస్తాయి.

ప్రణాళికబద్ధంగా ఎర్రబెల్లి

పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు పురపాలక సంఘంలో విజయం కోసం ఎర్రబెల్లి దయాకర్‌రావు ముందస్తు వ్యూహంతో పనిచేస్తున్నారు. అభ్యర్థుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. తొర్రూరుపై పూర్తి భరోసాతో ఉన్న ఆయన ఇతర నియోజకవర్గాలు, జిల్లాల్లో ఎన్నికల బాధ్యతలకు మొగ్గుచూపుతున్నారు.

ప్రశాంత్‌రెడ్డి పథకం
బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్‌ ఒక్కటే పురపాలక సంఘం కాగా.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి దానికి విశేష ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి పనిచేస్తున్నారు. టికెట్ల కేటాయింపుపైనా నేతలకు స్పష్టత ఇచ్చారు. ఒక విడత ప్రచారం పూర్తి చేశారు.

ఈశ్వర్‌కు కీలకం

ధర్మపురి నియోజకవర్గ కేంద్రాన్ని పురపాలక సంఘంగా చేయించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇక్కడ ఘన విజయం సాధించాలనే భావనతో పనిచేస్తున్నారు. పురపాలక సంఘంలో వార్డు స్థాయి సమావేశాలు జరిపించారు. పార్టీ నేతలతో భేటీలు జరిపారు. అభ్యర్థుల ఎంపికపైనా అభిప్రాయ సేకరణ జరిపారు. ఎక్కడా సమస్యలు లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

నిరంజన్‌కు ముఖ్యమే
ఈ నియోజకవర్గంలోని వనపర్తి, పెబ్బేరు పురపాలికలపై నిరంజన్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. విస్తృతంగా పర్యటనలు, సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ నేతలతో భేటీ అయి వారికి దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీలో ఐక్యత కారణంగా ఇక్కడ పార్టీ ఆధిక్యంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

జగదీశ్‌ పంథా

సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోని పురపాలక సంఘంలో మరోసారి పాగా కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో యత్నిస్తున్నారు. ఎక్కువ కాలం అక్కడే ఉంటున్నారు. పార్టీ నేతలతో సమావేశాలు, పర్యటనలు సాగిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వార్డులవారీగా ప్రచార ప్రణాళికను అమలు చేస్తున్నారు.

ఇంద్రకరణ్‌ పర్యవేక్షణ

నిర్మల్‌ నియోజకవర్గ కేంద్రంలోని పురపాలక సంఘంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సానుకూలత ఉంది. కాంగ్రెస్‌, భాజపాల నుంచి పోటీ ఉన్నా... ఆయన పార్టీని విజయం వైపు నడిపించేందుకు తన రాజకీయ అనుభవాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు. రెండు నెలల నుంచి ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

సీఎం నియోజకవర్గంలో..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన గజ్వేల్‌లో పురపాలక సంఘం ఉంది. అక్కడ భారీ విజయం సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఇతర నేతలతో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేశారు. పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు.

కేటీఆర్‌ ముందుకు...

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లలో ఒకే పురపాలక సంఘం ఉంది. గత ఎన్నికల్లో తెరాసనే ఇక్కడ గెలిచింది. కేటీఆర్‌ ఈ సంఘంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే రెండు దఫాలు సమావేశం నిర్వహించారు. ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేశారు. తరచూ అక్కడ పర్యటిస్తున్నారు. పోటీ తీవ్రత దృష్ట్యా టికెట్లు కొందరికి ఇచ్చి, మిగిలిన వారిని నియమిత పదవుల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు.

Last Updated : Jan 6, 2020, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details