Baby in plastic cover : నీలోఫర్ ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన.. ప్లాస్టిక్ కవర్‌లో పసికందు - ప్లాస్టిక్ కవర్‌లో శిశువు
10:06 April 04
Baby in plastic cover: నీలోఫర్ ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన.. ప్లాస్టిక్ కవర్‌లో పసికందు
Baby in plastic cover: నవమాసాలు మోసి, కన్న బిడ్డలను ఏ తల్లి అయినా కంటికిరెప్పలా సాకుతుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. అంగవైకల్యం.. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా అక్కున చేర్చుకుంటుంది మాతృహృదయం.. రంగు, రూపు ఇలా ఎలాంటి భేదబావం చూడనిది కన్నపేగు మాత్రమే. తన గారాలపట్టిని ఎవరైనా పల్లెత్తుమాట అన్నా సహించదు. చిన్న దెబ్బపడినా ఊరుకోదు. అలాంటిది హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రి వద్ద పసికందును వదిలేసి వెళ్లడం కలకలం రేపింది.
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి వద్ద పది 10 రోజుల వయస్సున్న పసికందును కవరులో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయారు. పట్టుమని పదిరోజులు నిండిన ప్రాణంతో ఉన్న బిడ్డను చూసి స్థానికులు నిశ్చేష్టులయ్యారు. ఆటోలో వచ్చి కవర్‌ను ఆస్పత్రి వద్ద పెట్టి వెళ్లినట్లు గుర్తించిన స్థానికులు వైద్యులకు సమాచారం అందించారు. పాపకు చికిత్స అందించిన వైద్యులు చిన్నారికి అంగవైక్యలం ఉందని నిర్ధరించారు. ఇదే కారణంతో చిన్నారిని వదిలేసి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. శిశువుకు అంగవైకల్యంతో పాటు కామెర్లు ఉన్నాయని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి అంగవైకల్యం, అనారోగ్యం ఉందనే వదిలి వెళ్లారా..? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద పసికందును వదిలేసి వెళ్లిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. సమీపంలో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి:చెరువులో ఈతకని వెళ్లి.. ముగ్గురు బాలురు మృతి