తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌చొరవ.. అలల మీద దూసుకెళ్తున్న పేదింటి బిడ్డలు

హుస్సేన్​ సాగర్​లో రెపరెపలాడే తెరచాపలు నడిపేది ప్రొఫెషనల్‌ క్రీడాకారులు అని అందరూ అనుకుంటారు. కానీ వాటిని పేదింటి బిడ్డలే నడుపుతారు. 'హైదరాబాద్ యాట్ క్లబ్' ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అలలమీద దూసుకెళ్తున్నారు ఆ పిల్లలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...!

sailing, hyderabad yacht club
ప్రతిభకు అవకాశం

By

Published : Jun 27, 2021, 4:22 PM IST

హుస్సేన్‌ సాగర్‌ని ట్యాంక్‌బండ్‌ పైనుంచో నెక్లస్‌రోడ్డు దగ్గరనుంచో చూస్తే సరస్సు మధ్యలో రెపరెపలాడుతూ తెరచాపలు కనిపిస్తాయి. ఆ పడవలను నడుపుతున్నది ప్రొఫెషనల్‌ క్రీడాకారులు అనుకుంటారెవారైనా. కానీ వాటిని నడిపేది పేదింటి బిడ్డలు. ఖరీదైన ఈ క్రీడలోకి పేద కుటుంబాలకు చెందిన పిల్లలూ అడుగుపెట్టే అవకాశం ఇస్తోంది ‘హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌’. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అలలమీదా దూసుకెళ్తున్నారా పిల్లలు!

అలల మీద దూసుకెళ్తున్న పేదింటి బిడ్డలు

ప్రతిభకు అవకాశం

మణిదీప్‌... వయసు పదేళ్లు. కూలీ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న అతడి తల్లిదండ్రులు తమ జీవితంలో వెలుగు రేఖల్ని ఇప్పుడప్పుడే చూస్తారనుకోలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వాళ్లబ్బాయి బెంగళూరులోని ఆర్మీ స్పోర్ట్స్‌ స్కూల్‌కి ఎంపికయ్యాడు. అక్కడ చదువుకుంటూనే పది తర్వాత నేరుగా ఆర్మీలో ఉద్యోగిగా చేరుతాడు. మణిదీప్‌తోపాటు నితిన్‌, అభిరామ్‌, హర్షవర్ధన్‌... కూడా ఇదే స్కూల్‌కి ఎంపికయ్యారు. సెయిలింగ్‌లో ప్రతిభ చూపడం ద్వారా వీరికా అవకాశం దొరికింది. జంట నగరాల్లో ఇలాంటి పిల్లలకు సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తోంది సుహీమ్‌ షేక్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌. ఐఐటీ మద్రాసులో చదువుకున్న సుహీమ్‌... హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించాడు. కాలేజీ రోజుల్లో సెయిలింగ్‌లో జాతీయ ఛాంపియన్‌గా నిల్చినా ఆర్థిక భారంతో ఆటకు మధ్యలోనే స్వస్తిచెప్పాడు. అయినా సెయిలింగ్‌ను మర్చిపోలేకపోయాడు. ఈ క్రీడలో ఆర్థికంగా ఉన్నత కుటుంబాలకు చెందినవాళ్లూ, ఆర్మీ, నేవీలకు చెందిన అధికారులూ కనిపిస్తారు. ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకున్నాడు సుహీమ్‌.

ఖరీదైన క్రీడ

ముగ్గురితో మొదలు...

తన క్లబ్‌ద్వారా పేద పిల్లలకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాడు సుహీమ్‌. 2009లో తన ఆలోచన గురించి అధికారులతో పంచుకుంటే హుస్సేన్‌సాగర్‌ని ఆనుకుని ఉండే సంజీవయ్య పార్క్‌ దగ్గర జెట్టీ కేటాయించారు. జంట నగరాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి సెయిలింగ్‌మీద అవగాహన కల్పించి ఆసక్తి ఉన్నవాళ్లని చేర్చుకోవాలనేది సుహీమ్‌ ప్రణాళిక. కానీ పిల్లల్ని నీటిలోకి పంపడానికి తల్లిదండ్రులు మొదట భయపడ్డారు. వాళ్లతో మాట్లాడి పిల్లలకు ఏం కాదనే భరోసా ఇచ్చాడు సుహీమ్‌. ముగ్గురు విద్యార్థులతో మొదటి బ్యాచ్‌ను ప్రారంభించారు. 7-12 ఏళ్ల వయసు పిల్లలకు పరుగులాంటి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి ఎంపికచేస్తారు. వారికి మొదట ఈత ఆపైన పడవ నడపడంలో తర్ఫీదు ఇస్తారు. సెయిలింగ్‌ అంటే నీటి పోటును ఎదుర్కొని, గాలికి అనుకూలంగా పడవను తిప్పగలిగేంత బలం కావాలి. అందుకే పిల్లలకు పోషకాహారాన్నీ అందిస్తారు.

ప్రతిభకు అవకాశం

ఇప్పటివరకు 700 మంది

క్లబ్‌ నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలూ, స్పాన్సర్లూ, మిత్రులూ సుహీమ్‌కు సాయపడతారు. పిల్లల నుంచి ఫీజు తీసుకోరు. పోటీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్నీ క్లబ్‌ భరిస్తుంది. ఇప్పటివరకూ దాదాపు 700 మంది ఈ క్లబ్‌లో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం 140 మంది శిక్షణలో ఉండగా వారికోసం 130 పడవలు ఉన్నాయి.

ఒలింపిక్‌ పతకమే లక్ష్యం...
సుహీమ్‌

ఈ యాట్‌ క్లబ్‌కు చెందిన సెయిలర్లు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో 75 వరకూ పతకాలు గెలిచారు. అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. 15 మంది బాలలు ఆర్మీ, నేవీలు నిర్వహించే స్పోర్ట్స్‌ స్కూల్స్‌కి ఎంపికయ్యారు. ఇంకొందరు శిక్షకులుగా మారారు. బాలికల కోసం ప్రత్యేకంగా ‘నావికా’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో భాగంగా శిక్షణకు ఎంపికైన పేదింటి బిడ్డలు ఝాన్సీ, వైష్ణవి ఇటలీలో ఈ జులైలో జరిగే ప్రపంచ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-16 విభాగంలో పోటీపడబోతున్నారు. ‘మాకు పిల్లలు లేరు. ఈ పిల్లలే మా కుటుంబం అనుకుంటా. హుస్సేన్‌ సాగర్‌లో నీటి నాణ్యత లేకపోయినా, దాన్నో అడ్డంకిగా భావించకుండా పిల్లలు ముందుకు వస్తున్నారు. నా శిష్యులు ఒలింపిక్‌ పతకం తేవాలనేది జీవిత లక్ష్యం’ అని చెబుతారు సుహీమ్‌.

ఇదీ చదవండి:చల్లచల్లని వాతావరణానికి నోరూరించే చాట్​​!

ABOUT THE AUTHOR

...view details