తెలంగాణ

telangana

ETV Bharat / state

వాహనదారుల దుశ్చర్యలు... కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబర్​ ప్లేట్లను మార్చే వారు కొందరైతే... అంకెలు​ కనిపించకుండా ప్లేటును వంచేస్తున్న వారు ఇంకొందరు.. ట్రాఫిక్‌ నిఘా నేత్రం నుంచి తప్పించుకునేందుకు వాహనచోదకులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

వాహన చోదకుల దుశ్చర్యలు... కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు
వాహన చోదకుల దుశ్చర్యలు... కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు

By

Published : Nov 3, 2020, 5:36 PM IST

భాగ్యనరంలో 50 లక్షలకు పైగానే వాహనాలున్నాయి. రోజుకు వెయ్యి కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. వాహనచోదకులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించకపోవడం వల్ల రహదారులపై ట్రాఫిక్​ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి వారిపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారిస్తున్నారు. నిఘా నేత్రాలకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ నంబరు కనిపించకపోవడం వల్ల జరిమానా నుంచి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాహన యజమాని చిరునామా ఆధారంగా జరిమానాలు పంపడం సాధ్యంకావడం లేదు.

వంచేసే వారు కొందరైతే... తొలగిచే వారు ఇంకొందరు

జరిమానాల నుంచి తప్పించుకునేందుకు రకరకాల యత్నాలు చేస్తున్నారు. నంబర్​ ప్లేటుపై అంకెలను తొలగిస్తూ.. నంబర్​ బోర్డును వంచేస్తూ... తదితర చర్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల వాహన యజమాని చిరునామా గుర్తించడం ట్రాఫిక్ పోలీసులకు కష్టమవుతోంది. కేవలం జరిమానాల నుంచి తప్పించుకోడానికే కాకుండా.... చోరీలు, గొలుసు దొంగతనాలకు పాల్పడే వాళ్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

మచ్చుకొకటి..

ఇటీవల బంజారాహిల్స్‌లోని నిబంధనలు ఉల్లఘించిన కారు యజమాని ఆటోకు సంబంధించిన నంబర్‌ ప్లేట్‌ వాడుతున్నట్టు తేలింది. ఆ కారు పలు మార్లు ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించగా.. నంబర్​ ప్లేట్​ ఆధారంగా విధించిన జరిమానా... ఆటో డ్రైవర్‌కు వెళ్లింది. దీనిపై బాధితుడు పోలీసులకు మొరపెట్టుకోగా... అసలు విషయం బయటపడింది. ఈ తరహా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

భారీగా కేసులు..

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2018లో నంబర్‌ ప్లేట్‌లు సక్రమంగా లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వాటిలో 86 వేల కేసులు నమోదయ్యాయి. 2019లో 1.51లక్షల మందిపై కేసులు పెట్టారు. 2020 సెప్టెంబరు నెల వరకు 1.32 లక్షల కేసులు నమోదయ్యాయి. వాటిలో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 2019లో 48,873, 2020లో సెప్టెంబరు వరకు 44,025 కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్‌లో 2019 లో 15,014, 2020లో సెప్టెంబరు వరకు 16,751 కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. వాహనచోదకులు మోటారు వాహనాల చట్టాలకనుగుణంగా నిబంధనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:ధ‍రణిలో ఆస్తుల వివరాల నమోదుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details